దక్షిణ కాశీగా పిలిచే శ్రీకాళహస్తి ప్రభ రోజురోజుకూ ప్రపంచవ్యాప్తం అవుతోంది. ఎక్కడెక్కడి దేశాల నుంచో భక్తులు శ్రీకాళహస్తికి తరలివస్తున్నారు. రాహు కేతు పూజలు చేస్తూ దోషాలను తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నారు. శుక్రవారం( సెప్టెంబర్ 1) 20 మంది రష్యన్ భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వీరంతా హిందూ సంప్రదాయ ప్రకారం వస్త్రాల ధరించి ఆలయానికి చేరుకుని స్వామివారిని, అమ్మవారిని దర్శించుకున్నారు. ఓం నమః శివాయా.. అంటూ ముక్కంటి నామ స్మరణలతో.. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
శ్రీకాళహస్తీశ్వరుణి సేవలో పాల్గొని ఆలయ విశిష్టత, చరిత్ర, ప్రాచుర్యం గురించి అడిగి తెలుసుకున్నారు. విదేశీ భక్తుల దర్శనం కోసం ఏర్పాట్లు చేసిన అధికారులు.. దర్శనం అనంతరం ఆలయ విశేషాలను వారికి వివరించారు. ఇదే సమయంలో ఆలయంలోని మిగతా భక్తులు సైతం వారిని ఆసక్తిగా గమనించారు. దర్శనం తర్వాత ఆలయం మొత్తం కలియతిరిగిన రష్యావాసులు.. ఆలయ కట్టడాన్ని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆలయ ప్రాంగణంలో శివనామ స్మరణ చేస్తూ.. శివాలయంలో చాలా సేపు ఆనందంగా గడిపారు.
భారతీయ సాంస్కృతిక వైభవాన్ని, శిల్పకళా నైపుణ్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ధ్వజస్తంభంతో పాటు ఆలయ పరిసరాల్లో సెల్ఫీలు దిగుతూ.. శిల్పకళావైభవాన్ని కెమెరాల్లో నిక్షిప్తం చేసుకున్నారు. శ్రీకాళహస్తిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్న రష్యన్ భక్తులు.. భారతదేశంలో శిల్పకళకు పూర్వీకులు నిర్మించిన ఆలయాల్లే మరపురాని ఆనవాళ్లని అభిప్రాయపడ్డారు. తమకు ఇదో మరపురాని అనుభూతి అంటూ సంతోషం వ్యక్తం చేశారు. ఆలయంలో సందడి చేసిన రష్యన్ లతో సెల్ఫీలు తీసుకునేందుకు స్థానిక భక్తులు పోటీపడ్డారు.
