
కీవ్: రష్యా డ్రోన్ దాడిలో ఉక్రెయిన్ నావికా దళానికి చెందిన అతిపెద్ద యుద్ధ నౌక ధ్వంసమై సముద్రంలో మునిగిపోయింది. ఉక్రెయిన్‌లోని ఒడెస్సా ప్రాంతంలోని డాన్యూబ్ నదీ డెల్టాలో యుద్ధ నౌక సిమ్‌ఫెరోపోల్ శుక్రవారం మోహరించి ఉండగా రష్యా సముద్ర డ్రోన్‌తో అటాక్ చేసింది. దీంతో ఆ భారీ నౌక నడిసముద్రంలోనే ముక్కలైపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
రష్యా, ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత ఉక్రెయిన్ యుద్ధ నౌకపై రష్యా సముద్ర డ్రోన్‌తో దాడి చేయడం ఇదే తొలిసారి. డ్రోన్ దాడిలో ఉక్రెయిన్ నిఘా నౌక ధ్వంసమైందని ఉక్రెయిన్ ధ్రువీకరించింది. ఈ దాడిలో ఒక నేవీ ఆఫీసర్ చనిపోగా, పలువురు గల్లంతైనట్లు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. వారికోసం సముద్రంలో గాలిస్తున్నట్లు వెల్లడించారు. రేడియో, ఎలక్ట్రానిక్, రాడార్, ఆప్టికల్ నిఘా కోసం రూపొందించిన మధ్యతరహా నౌక 2021 నుంచి ఉక్రెయిన్ నేవీలో కీలక సేవలందించింది.