ఫుడ్ తీసుకెళ్తుంటే.. రెస్క్యూ సిబ్బందిని బంధించిన్రు

ఫుడ్ తీసుకెళ్తుంటే.. రెస్క్యూ సిబ్బందిని బంధించిన్రు

కీవ్/మాస్కో: రష్యా ముప్పేట దాడుల్లో పూర్తిగా నాశనమైన మరియుపోల్ సిటీలో చిక్కుకున్న ప్రజలకు ఫుడ్, ఇతర అత్యవసర వస్తువులను తీసుకెళ్తున్న సిబ్బందిని రష్యన్ బలగాలు బంధించాయి. ఆగ్నేయ ఉక్రెయిన్ లోని మరియుపోల్ నగరంలోకి మంగళవారం హ్యుమానిటేరియన్​ కాన్వాయ్ ద్వారా ఆహారం తీసుకెళ్తున్న 11 మంది డ్రైవర్లు, నలుగురు అత్యవసర సహాయక సిబ్బందిని వెహికల్స్ తో సహా రష్యన్ ఆర్మీ నిర్బంధంలోకి తీసుకున్నదని బుధవారం ఉక్రెయిన్ ఆరోపించింది. ఇంతకుముందు 4.30 లక్షల మంది జనాభా ఉన్న మరియుపోల్ సిటీలో ప్రస్తుతం లక్ష మంది పౌరులే ఉన్నారని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ వెల్లడించారు. సిటీలో చిక్కుకున్న ఈ లక్ష మంది ప్రజలంతా కరెంట్, నీళ్లు, తిండి లేక గోస పడుతున్నారని, వారి కోసం మానవతా కారిడార్​ల ఏర్పాటుకు తాము ప్రయత్నిస్తుంటే రష్యన్ బలగాలు దాడులతో ఆటంకం కలిగిస్తున్నాయని తెలిపారు. సిటీ నుంచి మంగళవారం 7 వేల మంది పారిపోయి రాగలిగారని అన్నారు. ఉక్రెయిన్ ప్రభుత్వ ఉద్యోగులను రష్యన్లు బందీలుగా పట్టుకుంటున్నారని, తమ దేశం ఉనికిని కోల్పోయే ప్రమాదంలో ఉందన్నారు.  

గత 20 రోజులుగా మరియుపోల్ సిటీని రష్యా బాంబుల వర్షంతో నామరూపాల్లేకుండా చేసిందని అక్కడి నుంచి పోలెండ్ కు పారిపోయి వచ్చిన విక్టోరియా టోట్సెన్ అనే వ్యక్తి చెప్పారు. కాగా, ఉత్తరాదిలోని చెర్నిహివ్ సిటీ నుంచి కీవ్​కు వెళ్లేదారిలోని బ్రిడ్జిని రష్యన్ బలగాలు బుధవారం పేల్చివేశాయి. 
రష్యాపై మరింత ఒత్తిడి తేవాలని జపాన్, ఇటలీ ఎంపీలను జెలెన్ స్కీ కోరారు. బుధవారం రెండు దేశాల పార్లమెంట్​లను ఉద్దేశించి ఆయన వేర్వేరుగా వర్చువల్ సమావేశాల్లో మాట్లాడారు.