నిద్రపోతున్నోళ్లపై బాంబులు.. 50 మంది సోల్జర్లు మృతి

నిద్రపోతున్నోళ్లపై బాంబులు.. 50 మంది సోల్జర్లు మృతి
  • కింజాల్​ క్షిపణితో మిసైల్ ​గోడౌన్​ను పేల్చేసింది
  • తొలిసారి హైపర్ సోనిక్ మిసైల్​తో రష్యా దాడి
  • నిద్రపోతున్నోళ్లపై బాంబులు.. 50 మంది సోల్జర్లు మృతి   
  • వెంటనే శాంతి చర్చలకు రావాలె
  • లేకుంటే రష్యాకు తీవ్ర నష్టం తప్పదు: జెలెన్ స్కీ

కీవ్/మాస్కో: శాంతి చర్చలకు ఉక్రెయిన్ ముందుకొస్తలేదని ఓవైపు ఆరోపిస్తున్న రష్యా.. మరోవైపు తన దాడులను మాత్రం రోజురోజుకూ పెంచుతోంది. అటు ప్రజలు ఉంటున్న బిల్డింగ్స్, ఆస్పత్రులు, స్కూళ్లపైన.. ఇటు ఎయిర్ బేస్​లు, మిలిటరీ స్థావరాలు, ఫ్యాక్టరీలపైన బాంబులువేస్తోంది. శుక్రవారం తొలిసారిగా కింజాల్(డ్యాగర్) హైపర్ సోనిక్ మిసైల్​నూ ప్రయోగించింది. నాటో సభ్య దేశం రొమేనియాకు బార్డర్​లో, పశ్చిమ ఉక్రెయిన్ లో ఉన్న ఇవనో ఫ్రాన్కివిస్క్ ఏరియాలోని డెలియటిన్ గ్రామం వద్ద అండర్ గ్రౌండ్ లో మిసైల్స్, పేలుడు పదార్థాలను దాచి ఉంచిన గోడౌన్​ను కింజాల్ క్షిపణితో పేల్చేసినట్లు శనివారం రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. ధ్వని వేగం కంటే 10 రెట్లు స్పీడ్ గా.. గంటకు 12,250 కిలోమీటర్లు దూసుకెళ్లే కింజాల్ క్షిపణులను ఉక్రెయిన్ పై రష్యా ప్రయోగించడం ఇదే మొదటిసారి అని రష్యన్ మీడియా సంస్థ ఆర్ఐఏ నొవస్తి వెల్లడించింది. కింజాల్ మిసైల్​ను అడ్డుకునే రక్షణ వ్యవస్థలు ప్రస్తుతం ఏ దేశం వద్దా లేవని తెలిపింది. 2011 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ధ్వంసంచేసే కింజాల్ క్షిపణితో అణ్వాయుధాలు కూడా ప్రయోగించవచ్చని,  కానీ శుక్రవారం నాటి దాడిలో సాధారణ వార్ హెడ్ నే ఉపయోగించారని పేర్కొంది.  

వెంటనే చర్చలకు రావాలె: ఉక్రెయిన్​ ప్రెసిడెంట్
రష్యా ఆలస్యం చేయకుండా వెంటనే శాంతి చర్చలకు ముందుకు రావాలని శనివారం ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వొలోదిమిర్ జెలెన్ స్కీ వీడియో మెసేజ్ లో పిలుపునిచ్చారు. ‘‘శాంతి కోసం, ఉక్రెయిన్ కోసం, మా భద్రత కోసం ఆలస్యం చేయకుండా అర్థవంతమైన, న్యాయమైన చర్చలు జరపాలి. రష్యా తన సొంత తప్పులతో చేసుకున్న నష్టాన్ని తగ్గించుకునేందుకు ఇదొక్కటే మార్గం” అని ఆయన స్పష్టం చేశారు. ‘‘ఉక్రెయిన్ కు న్యాయం చేయాలి. దేశ భూభాగ సమగ్రతను పునరుద్ధరించాలి. ఇందుకోసం భేటీకి, చర్చలకు ఇదే తగిన సమయం. కాదంటే.. యుద్ధంలో జరిగే నష్టాల నుంచి రష్యా కోలుకునేందుకు ఎన్నో తరాలు పడుతుంది” అని జెలెన్ స్కీ హెచ్చరించారు.

15 వేల రష్యన్ సోల్జర్లు మృతి? 
యుద్ధంలో ఇప్పటివరకు 15 వేల మంది రష్యన్ సోల్జర్లు చనిపోయారని ఉక్రెయిన్ అధికారులు ప్రకటించారు. అయితే, 7 వేల మంది రష్యన్ సైనికులు చనిపోయి ఉండొచ్చని అమెరికన్ అధికారులు వెల్లడించగా, తమ సైనికులు 500 మందే చనిపోయారని రష్యా చెప్తోంది. శనివారం రష్యాకు చెందిన మరో జనరల్ చనిపోయాడని, దీంతో యుద్ధంలో చనిపోయిన రష్యన్ ఆర్మీ జనరల్స్ సంఖ్య ఐదుకు చేరినట్లు మీడియా తెలిపింది. అయితే, ఉక్రెయిన్ లో చనిపోయిన రష్యన్ సోల్జర్ల మృతదేహాలను అర్ధరాత్రి ట్రెయిన్​లో ఎక్కించి తరలిస్తున్నారని, వారం రోజుల్లోనే 2,500 మృతదేహాలను రష్యాకు పంపారని హోమెల్ సిటీలోని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఇక ఉక్రెయిన్​లో శుక్రవారం నాటికి  847 మంది పౌరులు చనిపోయారని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంస్థ వెల్లడించింది. కానీ వాస్తవ మృతుల సంఖ్య ఇంతకంటే ఎన్నో రెట్లు 
ఎక్కువని భావిస్తున్నారు.

ఆర్మీ బ్యారక్ లపై దాడులు  
ఉక్రెయిన్ లోని దక్షిణాది నగరం మైకోలాయివ్ లోని మిలిటరీ బ్యారక్ లపై రష్యా శుక్రవారం తెల్లవారుజామున బాంబుల వర్షం కురిపించింది. సుమారు 200 మంది సోల్జర్లు బ్యారక్ లలో నిద్రపోతుండగా దాడులు జరగగా, 50 మంది సోల్జర్లు చనిపోయారని ‘ఏఎఫ్​పీ’ వార్తా సంస్థ వెల్లడించింది. శిథిలాల తొలగింపు, రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని, ఇంకా ఎంత మంది చనిపోయారన్నది తెలియాల్సి ఉందని తెలిపింది.  ఈ దాడుల్లో సుమారు 100 మంది చనిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. మరోవైపు జపోరిజియా సిటీలో సోమ వారం ఉదయం వరకూ 38 గంటల పాటు కర్ఫ్యూ విధించినట్లు డిప్యూటీ మేయర్ వెల్లడించారు. అజోవ్ సముద్రం వద్ద ఉన్న ప్రధాన ఓడరేవు పట్టణం మేరియపోల్ పై రష్యా పట్టు సాధించినట్లు అధికారులు తెలిపారు.