వీసా, పాస్​పోర్ట్​ లేకున్నా డెన్మార్క్ నుంచి అమెరికాకు వెళ్లిన రష్యన్​

వీసా, పాస్​పోర్ట్​ లేకున్నా డెన్మార్క్ నుంచి అమెరికాకు వెళ్లిన రష్యన్​

న్యూఢిల్లీ: విమానంలో ఒక దేశం నుంచి మరో దేశానికి ప్రయాణించాలంటే పాస్ పోర్టు, వీసా, ఫ్లైట్ టికెట్ ఉండాలి. కానీ రష్యాకు చెందిన ఓ వ్యక్తి ఇవేవీ లేకుండానే యూరప్ నుంచి అమెరికాకు ప్రయాణం చేశాడు. అతను అమెరికా ఎయిర్ పోర్టులో దిగినంక కస్టమ్స్ అధికారులు గుర్తించి ఆశ్చర్యానికి గురయ్యారు. ఎయిర్ పోర్టులో టైట్ సెక్యూరిటీ ఉంటుంది. టికెట్ ఉంటే తప్ప లోపలికి అడుగేపెట్టలేం.. అలాంటిది ఆ వ్యక్తి ఎయిర్ పోర్టు లోపలికి ఎలా వెళ్లాడు? ఫ్లైట్ ఎలా ఎక్కాడు? ఎయిర్ పోర్టు అధికారులు, ఫ్లైట్ సిబ్బంది ఎవరూ అతణ్ని ఎందుకు గుర్తించలేకపోయారు? అనేది ఆశ్చర్యంగా ఉంది. ఈ షాకింగ్ ఘటన పోయిన నెలలో జరిగింది. దీనిపై అమెరికా విచారణ సంస్థ ఎఫ్ బీఐ దర్యాప్తు చేస్తోంది.

ఫ్లైట్ లో వింత ప్రవర్తన..

రష్యాకు చెందిన సెర్గీ వ్లాదిమిరోవిచ్ ఓచిగావా అనే వ్యక్తి నవంబర్ 4న యూరప్​లోని డెన్మార్క్ నుంచి అమెరికాకు ప్రయాణం చేశాడు. కోపెన్ హగెన్ ఎయిర్ పోర్టు నుంచి స్కాండినేవియన్ ఎయిర్ లైన్స్ కు చెందిన ఫ్లైట్​లో అమెరికాలోని లాస్ ఏంజెలిస్​ కు జర్నీ చేశాడు. కానీ అతని దగ్గర ఫ్లైట్ టికెట్, బోర్డింగ్ పాస్, పాస్ పోర్టు, వీసా గానీ ఏదీ లేదు. లాస్​ఏంజిలిస్​ ఎయిర్ పోర్టులో దిగినంక కస్టమ్స్ అధికారులు సెర్గీని గుర్తించి షాక్ అయ్యారు. ఫ్లైట్ ప్యాసింజర్ల లిస్టులోనూ అతని పేరులేదని తెలుసుకుని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సెర్గీని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. కాగా, ఫ్లైట్​లో సెర్గీ వింతగా ప్రవర్తించాడని క్రూ సిబ్బంది తెలిపారు. ‘‘తోటి ప్యాసింజర్లతో మాట్లాడేందుకు సెర్గీ ప్రయత్నించాడు. కానీ అతణ్ని ఎవరూ పట్టించుకోలేదు. సెర్గీ తరచూ సీట్లు మార్చాడు. రెండుసార్లు మీల్స్ అడిగాడు. ఒకానొక దశలో మా చాక్లెట్లు కూడా తీసుకుని తినేందుకు ప్రయత్నించాడు” అని సిబ్బంది పేర్కొన్నారు. కాగా, అసలు ఏం జరిగిందో కూడా తనకు గుర్తు లేదని సెర్గీ పేర్కొన్నట్టు ఆఫీసర్ కరోలిన్ వాల్లింగ్ తెలిపారు. ‘‘మూడ్రోజుల నుంచి నిద్రలేదని సెర్గీ తెలిపాడు. అసలు ఆ టైమ్​లో ఏం జరుగుతుందో కూడా అర్థం కాలేదన్నాడు. తన దగ్గర ఫ్లైట్ టికెట్ ఉండొచ్చని పేర్కొన్నాడు. కోపెన్ హగెన్ లో ఫ్లైట్ ఎలా ఎక్కింది కూడా తనకు గుర్తులేదన్నాడు’’ అని వాల్లింగ్ చెప్పారు.