బ్రిక్స్ దేశాలు సహకారం అందించాలన్న పుతిన్

బ్రిక్స్ దేశాలు సహకారం అందించాలన్న పుతిన్

బీజింగ్/న్యూఢిల్లీ: రష్యాపై పశ్చిమ దేశాలు ఆంక్షలతో విరుచుకుపడ్డాయని, బ్రిక్స్ దేశాలు తమకు సహకారం అందించాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ విజ్ఞప్తి చేశారు. ఉక్రెయిన్ యుద్ధం సాకుతో పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించడం స్వార్థపూరితమైన చర్యలని ఆయన మండిపడ్డారు. గురువారం చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ అధ్యక్షతన వర్చువల్ గా జరిగిన 14వ బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా) సమిట్ లో పుతిన్ మాట్లాడారు. పశ్చిమ దేశాల ఆంక్షలను వ్యతిరేకించాలని బ్రిక్స్ దేశాలను కోరారు. ‘‘ప్రస్తుత సంక్షోభ సమయంలో మనం నిజాయతీగా, పరస్పర ప్రయోజనాల కోసం సహకారం అందించుకుంటూ ముందుకు వెళ్లాలి. అవసరమైతే ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాలోని అనేక దేశాల సపోర్ట్ తో ఇండిపెండెంట్ పాలసీని రూపొందించుకోవాలి” అని ప్రతిపాదించారు. కొన్ని దేశాలు ఆర్థిక వ్యవస్థలను అడ్డుపెట్టుకుని తమ పాలసీలను ప్రపంచంపై రుద్దాలని చూస్తున్నాయని పరోక్షంగా అమెరికాను ఉద్దేశించి విమర్శించారు. పశ్చిమ దేశాలు రష్యాపై ఆర్థిక యుద్ధం చేస్తున్నాయని, అందుకే చైనా, ఇండియా వంటి పెద్ద దేశాలతో సంబంధాలను మరింత పెంచుకుంటున్నామని చెప్పారు. 

కోల్డ్ వార్ మనస్తత్వం వద్దు: జిన్ పింగ్ 

పశ్చిమ దేశాలు అంతర్జాతీయ ఆంక్షలను దుర్వినియోగం చేస్తున్నాయని చైనా ప్రెసిడెంట్ జిన్ పింగ్ విమర్శించారు. ట్రాన్స్ లేటర్ ద్వారా సమిట్లో మాట్లాడిన ఆయన.. బ్రిక్స్ దేశాలు అసలైన అంతర్జాతీయ వ్యవస్థ కోసం నిలబడాలన్నారు. ‘‘మనం కోల్డ్ వార్ మనస్తత్వాన్ని వదిలించుకోవాలి. ప్రాంతీయ శత్రుత్వాన్ని విడిచిపెట్టాలి. ఏకపక్ష ఆంక్షలను వ్యతిరేకించాలి” అని పిలుపునిచ్చారు. సమిట్ లో బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సొనారో, సౌతాఫ్రికా అధ్యక్షుడు రామఫోసా కూడా పాల్గొన్నారు.   

ఒకరికొకరం సహకరించుకుందాం: మోడీ   

బ్రిక్స్ సభ్య దేశాలు పరస్పరం సహకారం  అందించుకోవాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. కరోనా వల్ల దెబ్బతిన్న ప్రపంచ ఎకానమీ తిరిగి పుంజుకోవాలంటే మ్యూచువల్ కోఆపరేషనే చాలా ముఖ్యమన్నారు. బ్రిక్స్ లో గత కొన్నేండ్లలో చేపట్టిన మార్పులతో అంతర్జాతీయంగా ఈ గ్రూపు ప్రాబల్యం బాగా పెరిగిందన్నారు. బ్రిక్స్ ఆధ్వర్యంలోని న్యూ డెవలప్ మెంట్ బ్యాంక్ (ఎన్డీబీ) అభివృద్ధి పట్ల మోడీ సంతోషం వ్యక్తం చేశారు. ‘‘కోఆపరేషన్ పెరిగితే బ్రిక్స్ సభ్య దేశాల ప్రజలకు కూడా ప్రయోజనం కలుగుతుంది. మన సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు ఈ సమిట్ ఒక వేదికగా నిలుస్తుందని భావిస్తున్నాను” అని ఆయన వివరించారు.