హైదరాబాద్ హౌస్లో ఆతిథ్యం
హైదరాబాద్ చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్‌కు చెందిన ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్.. పుతిన్‌కు ఆతిథ్యం ఇవ్వనున్నది. ఈ చారిత్రక భవనాన్ని.. ప్రస్తుతం ప్రధాని స్టేట్ గెస్ట్ హౌస్‌గా ఉపయోగిస్తున్నారు. దీనిని1920ల్లో నిర్మించారు. ప్రస్తుతం దీని విలువ రూ.170 కోట్లు. ఎడ్విన్ లూటియన్స్.. తన పాత డిజైన్ల ఆధారంగా సీతాకోకచిలుక ఆకారంలో దీనిని కట్టారు. 8.2 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్యాలెస్‌లో 36 గదులు ఉంటాయి. 1974లో భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ హైదరాబాద్ హౌస్‌ను స్వాధీనం చేసుకుంది.
చాణక్య సూట్ ఒక రోజు అద్దె 10 లక్షలు
పుతిన్ ఇండియా పర్యటనలో భాగంగా ఐటీసీ మౌర్యాలోని ‘చాణక్య సూట్’లో ఉంటారు. ఇది దేశంలోనే అత్యంత ఖరీదైన సూట్ లలో ఒకటి. ఈ సూట్ 4,600 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. సెపరేట్ లివింగ్ రూమ్, డైనింగ్ హాల్, ఆఫీస్/స్టడీ ఏరియా, ప్రైవేట్ స్టీమ్ రూమ్, ప్రైవేట్ జిమ్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. ఒక రోజు అద్దె రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఉంటుంది. భద్రతా కారణాలతో పుతిన్ రాకకు ముందే హోటల్‌లోని అన్ని గదులను (సుమారు 437) బుక్ చేశారు.
కౌజు పిట్ట గుడ్లు..గొర్రె మాంసం
పుతిన్ కోసం ప్రధాని నివాసంలో ప్రైవేట్ డిన్నర్, హైదరాబాద్ హౌస్‌లో వర్కింగ్ లంచ్, అలాగే.. రాష్ట్రపతి భవన్ లో బ్యాంకెట్ కోసం ప్రత్యేక మెనూలను సిద్ధం చేశారు. వీటిలో కుంకుమపువ్వుతో చేసే ‘కహ్వా’, కాశ్మీరీ వంటకం ‘హాక్ కా సాగ్’, గలౌటీ కబాబ్స్, ముర్గ్ ధనివాల్ కుర్మా, ‘గులాబ్ ఖీర్’ ఉన్నాయి. పుతిన్ తేలికగా జీర్ణమయ్యే, సంప్రదాయ వంటకాలను ఇష్టపడతారట.
ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో టోవోరాగ్ (కాటన్ చీజ్, తేనె కలిపి చేసే వంటకం) తింటారు. కౌజుపిట్ట గుడ్లు, తాజా పండ్లతో చేసే జ్యూస్ తీసుకుంటారు. స్టర్‌జియన్ చేప, గొర్రె పిల్ల మాంసం అంటే పుతిన్‌కు చాలా ఇష్టమట. చక్కెరతో చేసే పదార్థాలకు మాత్రం ఆయన దూరంగా ఉంటారు.
