క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్.. ఇక కీమోథెరపీ అక్కర్లేదా..? క్యాన్సర్ వ్యాక్సిన్ కనిపెట్టిన రష్యా..!

క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్.. ఇక కీమోథెరపీ అక్కర్లేదా..? క్యాన్సర్ వ్యాక్సిన్ కనిపెట్టిన రష్యా..!

ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న క్యాన్సర్ వ్యాధికి మందు కనిపెట్టడంలో రష్యా పురోగతి సాధించింది. క్యాన్సర్కు చెక్ పెట్టేందుకు రష్యా చేసిన ప్రయోగాలు కీలక దశకు చేరుకున్నాయి. క్యాన్సర్కు మందుగా తాము కనిపెట్టిన ఎంట్రోమిక్స్ వ్యాక్సిన్ 100 శాతం ఫలితాన్ని ఇచ్చిందని రష్యా ప్రకటించింది.

కోవిడ్-19 వ్యాక్సిన్ తయారీకి వినియోగించిన mRNA పరిజ్ఞానంతో ఈ వ్యాక్సిన్ తయారుచేసినట్లు రష్యా తెలిపింది. శరీరంలోని వ్యాధి నిరోధక శక్తికి ఉత్ప్రేరకంగా ఈ వ్యాక్సిన్ పనిచేస్తుందని, క్యాన్సర్ కణాలను నిర్మూలించడానికి దోహదపడుతుందని రష్యా శాస్త్రవేత్తలు వెల్లడించారు. క్యాన్సర్ కణాలను నిర్మూలించడానికి చేసే కీమోథెరపీ వైద్య విధానానికి ఈ వ్యాక్సిన్ వినియోగం ప్రత్యామ్నయంగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు తెలపడం గమనార్హం.

రష్యా నేషనల్ మెడికల్ రీసెర్చ్ రేడియోలాజికల్ సెంటర్, ఎంగ్డేహర్డ్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మోలెక్యులర్ బయాలజీ సంయుక్తంగా ఈ వ్యాక్సిన్ ట్రయల్స్ నిర్వహించాయి. 48 మంది వాలంటీర్లపై ఈ ప్రయోగం చేశారు. క్యాన్సర్ ట్యూమర్లను తగ్గించి.. వాటి పెరుగుదలను క్రమంగా నిర్మూలించడంలో mRNA క్యాన్సర్ వ్యాక్సిన్ ప్రభావవంతంగా పనిచేసినట్లు ప్రీ క్లినికల్ ట్రయల్స్లో స్పష్టమైందని ఫెడరల్ మెడికల్ అండ్ బయోలాజికల్ ఏజెన్సీ (FMBA) హెడ్ వెరోనికా తెలిపారు.

క్యాన్సర్ నివారణలో భాగంగా రోగికి ఈ వ్యాక్సిన్ను పదేపదే ఇచ్చినా ఎలాంటి ప్రమాదం లేదని వివరించారు. ఈ వ్యాక్సిన్ను కొలొరెక్టల్ క్యాన్సర్‌ (పెద్ద ప్రేగు క్యాన్సర్) చికిత్సలో వినియోగిస్తామని.. బ్రెయిన్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్ చికిత్స కోసం మరొక వ్యాక్సిన్ వెర్షన్ను డెవలప్ చేస్తున్నట్లు FMBA హెడ్ వెరోనికా వెల్లడించారు.