మా సిటీలపై దాడి చేస్తే మిసైల్ దాడి చేస్తాం

మా సిటీలపై దాడి చేస్తే మిసైల్ దాడి చేస్తాం
  • ఉక్రెయిన్​కు రష్యా హెచ్చరిక
  • కీవ్ దగ్గర్లోని మిలిటరీ ఫ్యాక్టరీపై మిసైల్ దాడి 
  • 5 రోజులన్నరు.. 50 రోజులైనా పోరాడుతున్నం: జెలెన్​స్కీ

కీవ్/మాస్కో: ఉక్రెయిన్ తమ భూభూగంపై టెర్రర్  దాడులకు పాల్పడితే కీవ్ పై క్షిపణుల వర్షం కురిపిస్తమని శుక్రవారం రష్యా రక్షణ శాఖ హెచ్చరించింది. బార్డర్ లో ఉన్న తమ పట్టణాలను ఉక్రెయిన్ టార్గెట్ చేసుకుంటోందని, తమ భూభాగంపై దాడులు చేస్తే.. ఉక్రెయిన్ రాజధానిపైకి ప్రయోగించే మిసైల్ దాడుల సంఖ్యను పెంచుతామని వార్నింగ్ ఇచ్చింది. మరోవైపు గురువారం రాత్రి కీవ్ సమీపంలోని మిలిటరీ ఫ్యాక్టరీని తమ బలగాలు సముద్రం నుంచి ప్రయోగించే కాలిబర్ లాంగ్ రేంజ్ క్షిపణులతో పేల్చేశాయని ప్రకటించింది. క్షిపణులు, యుద్ధ విమానాలను ధ్వంసం చేసే వెపన్స్ ను తయారు చేస్తున్న ‘విజార్’ ప్లాంటును తాము ధ్వంసం చేశామని వెల్లడించింది. అలాగే గురువారం తమ దేశంలోని క్లిమోవో ప్రాంతంలో పౌరులపై దాడులుచేసిన ఉక్రెయిన్ కు చెందిన మిగ్8 హెలికాప్టర్​ను తమ ఎస్400 మిసైల్ సిస్టం కూల్చేసిందని రష్యా తెలిపింది. ఖార్కివ్ సిటీకి దగ్గర్లోని ఓ గ్రామంలో జరిగిన పోరాటంలో 30 మంది పోలాండ్ కు చెందిన ప్రైవేట్ సోల్జర్లను హతమార్చామని పేర్కొంది. బార్డర్​లోని తమ పట్టణాలపై ఉక్రెయిన్ హెలికాప్టర్లతో దాడులకు ప్రయత్నిస్తోందని, బెల్గార్డ్ రీజియన్ లోని ఓ గ్రామంపై షెల్లింగ్ కూడా చేసిందని రష్యా చెప్పింది.

నన్ను దేశం విడిచిరమ్మన్నరు.. జెలెన్ స్కీ 

ఉక్రెయిన్ ను ఓడించేందుకు 5 రోజులు చాలని రష్యా అనుకున్నదని, కానీ 50 రోజులైనా తాము పోరాటం కొనసాగిస్తున్నందుకు గర్వంగా ఉందని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వొలోదిమిర్ జెలెన్ స్కీ అన్నారు. ‘యుద్ధం మొదలైన రోజు చాలా దేశాల నేతలు ఉక్రెయిన్ మనుగడ సాధించలేదని అనుకున్నారు. దేశం విడిచి రమ్మంటూ నాకు సలహా ఇచ్చారు. కానీ ఉక్రెయిన్ పౌరులు ఎంత ధైర్యవంతులో, స్వాతంత్ర్యానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో వాళ్లకు తెలియదు’ అని జెలెన్ స్కీ చెప్పారు.  ఫిబ్రవరి 24న రష్యా దండయాత్ర మొదలుపెట్టిన రోజున.. ప్రాణాలు పణంగా పెట్టి పోరాటానికి సిద్ధమైన లక్షలాది మంది ఉక్రెయిన్ ప్రజలు సాధించిన విజయమిదని ఆయన అన్నారు.

20 వేల రష్యన్ సోల్జర్లు మృతి? 

రష్యా సేనల్లో ఇప్పటివరకూ 20 వేల మంది యుద్ధంలో చనిపోయారని ఉక్రెయిన్ ప్రకటించింది. రష్యాకు చెందిన 163 యుద్ధవిమానాలు, 144 హెలికాప్టర్లు, 756 యుద్ధ ట్యాంకులు, 1,443 ఆర్మర్డ్ వెహికల్స్, 76 ఫ్యూయెల్ ట్యాంకులు, 
8 నౌకలను ధ్వంసం చేశామని పేర్కొంది.

ఇది మూడో ప్రపంచయుద్ధమే! 

నల్ల సముద్రంలో రష్యాకు చెందిన మాస్క్వా యుద్ధనౌక మునిగిపోయినందున.. మూడో ప్రపంచ యుద్ధం మొదలైనట్లేనని రష్యా ప్రభుత్వ టీవీ చానల్ ‘రష్యా-1’ ప్రకటించింది.  రష్యా-1 చానల్ న్యూస్ ప్రెజెంటర్ ఓల్గా స్కబెయేవా ఇలా మూడో ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయిందంటూ కామెంట్ చేశారు. ‘‘ఇప్పుడు మనం నాటో వెపన్స్​కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాం” అని ఓల్గా చెప్పగా.. షిప్​ను ముంచేయడం అంటే రష్యా భూభాగంపై దాడి చేయడమేనని 
ఓ గెస్ట్ చెప్పారు.