భారత్-పాక్ సంయమనం పాటించాలి: ఆపరేషన్ సిందూర్‎పై రష్యా రియాక్షన్

భారత్-పాక్ సంయమనం పాటించాలి: ఆపరేషన్ సిందూర్‎పై రష్యా రియాక్షన్

మాస్కో: పహల్గాం ఉగ్రదాడి, దానికి కౌంటర్‎గా భారత్ ఆపరేషన్ సిందూర్‎తో భారత్, పాక్ మధ్య యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. ఈ క్రమంలో భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరడంపై రష్యా ఆందోళన వ్యక్తం చేసింది. ఉగ్రవాదాన్ని, ఉగ్రచర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని రష్యా విదేశాంగా ప్రతినిధి వెల్లడించారు. ప్రపంచానికి సవాల్ గా మారిన ఉగ్రభూతాన్ని నిర్మూలించడం కోసం ప్రపంచం ఏకతాటిపైకి రావాలని కోరారు.

ఇరుదేశాల మధ్య పరిస్థితులు మరింత దిగజారకుండా భారత్, పాక్ సంయమనం పాటించాలని సూచించారు. శాంతియుత చర్చల ద్వారానే పాక్ భారత్ మధ్య సమస్యలు పరిష్కారమవుతాయని పేర్కొన్నారు. ద్వైపాక్షిక చర్చలతో భారత్, పాక్ సమస్య పరిష్కరించుకోవాలని సూచించారు. ఇరుదేశాల మధ్య కుదిరిన 1972 సిమ్లా ఒప్పందం, 1999 లాహోర్ డిక్లరేషన్ ఆధారంగా ఉద్రిక్తతలను పరిష్కరించుకోవాలని పేర్కొన్నారు. 

కాగా, 2025, ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‎లోని పహల్గాంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు  నరమేధం సృష్టించిన విషయం తెలిసిందే. బైసారన్ మైదాన ప్రాంతంలో టూరిస్టులను ఊచకోత కోశారు ఉగ్రవాదులు. ముష్కరులు విచక్షణరహితంగా కాల్పులు జరపడంతో 26 మంది అమాయక టూరిస్టులు మృతి చెందారు. ఈ క్రమంలో పహల్గాం ఉగ్రదాడికి భారత్ రివేంజ్ తీర్చుకుంది.

►ALSO READ | పాక్ సరిహద్దు రాష్ట్రాల సీఎంలతో హోంమంత్రి అమిత్ షా భేటీ

2025, మే 6  మంగళవారం అర్ధరాత్రి తర్వాత 1.44 గంటలకు పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే)తో పాటు పాక్‌లోని టెర్రరిస్ట్‌ స్థావరాలపై ఇండియన్‌ ఎయిర్‌‌ఫోర్స్‌ విరుచుకుపడింది. ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా మిస్సైళ్లు, బాంబుల వర్షం కురిపింది. ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ చేపట్టిన ఈ కౌంటర్ ఎటాక్‎లో లష్కరే తోయిబా, జైషీ మహ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థలకు చెందిన దాదాపు 90 మంది టెర్రరిస్టులు హతమయ్యారు. భారత్ ఆపరేషన్ సిందూర్ తో దాడులు చేయడంతో ఇరు దేశాల మధ్య హై టెన్షన్ వాతావరణం నెలకొంది.