రష్యాలో ఒక్కరోజే  వెయ్యి మంది మృతి

రష్యాలో ఒక్కరోజే  వెయ్యి మంది మృతి

మాస్కో: రష్యాలో కరోనా కేసులు, మరణాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. యూరప్ మొత్తమ్మీద కరోనా మరణాలు రష్యాలోనే ఎక్కువగా నమోదవుతున్నాయి. దేశంలో శనివారం ఒక్కరోజే 1,002 మంది చనిపోగా.. 33,208 కేసులు నమోదయ్యాయి. శుక్రవారం 999 మంది చనిపోగా.. 32,196 కేసులు రికార్డయ్యాయి. దేశంలో కరోనా వల్ల ఒక్కరోజే వెయ్యి మంది చనిపోవడం ఇదే ఫస్ట్ టైమ్ అని అధికారులు చెప్పారు. రష్యా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని.. కేసులు, మరణాలు పెరుగుతున్నా లాక్ డౌన్ విధించడం లేదనే విమర్శలు ఉన్నాయి. మాస్కో, సెయింట్ పీటర్స్ బర్గ్ తదితర మెయిన్ సిటీల్లో మాత్రం సాధారణ పరిస్థితులే ఉన్నాయి.

స్లో వ్యాక్సినేషన్..

కేసులు, మరణాలు పెరగడానికి స్లో వ్యాక్సినేషన్ రేటు కూడా కారణమని ఎక్స్ పర్ట్స్ అంటున్నారు. దీంతో వ్యాక్సినేషన్ ను స్పీడప్ చేయడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. లాటరీలు, బోనస్ లు అంటూ టీకాలు వేసుకునేలా జనాన్ని ప్రోత్సహిస్తున్నారు. దేశంలో 14.6 కోట్ల మంది ప్రజలు ఉండగా, ఇప్పటి వరకు 4.3 కోట్ల మంది (29 శాతం) మాత్రమే రెండు డోసులు వేసుకున్నారు. కాగా, రష్యాలో ఇప్పటి వరకు 78 లక్షల కేసులు నమోదవగా.. 2,21,313 మంది చనిపోయారు.

ఇండియాలో కొత్త కేసులు 16 వేలు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. దాదాపు 7 నెలల తర్వాత యాక్టివ్ కేసులు 2 లక్షలకు తగ్గాయి. గత 24 గంటల్లో 2,046 యాక్టివ్ కేసులు తగ్గాయని, ప్రస్తుతం 2,01,632 ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం వెల్లడించింది. కొత్తగా 15,981 కేసులు నమోదయ్యాయని, దీంతో మొత్తం కేసుల సంఖ్య 3.40 కోట్లకు చేరిందని తెలిపింది. వైరస్ తో మరో 166 మంది చనిపోయారని, దీంతో మొత్తం మృతుల సంఖ్య 4,51,980కి పెరిగిందని చెప్పింది. శుక్రవారం 9,23,003 టెస్టులు చేశామని, దీంతో మొత్తం టెస్టుల సంఖ్య 58.98 కోట్లకు చేరిందని పేర్కొంది. డైలీ పాజిటివిటీ రేటు 1.73 శాతంగా, వీక్లీ పాజిటివిటీ రేటు 1.44 శాతంగా, రికవరీ రేటు 98.07 శాతంగా, డెత్ రేటు 1.33 శాతంగా నమోదైందని వివరించింది. కరోనా నుంచి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 3.33 కోట్ల మంది కోలుకున్నారని వెల్లడించింది. ఇప్పటి వరకు 97.23 కోట్ల టీకా డోసులను వేసినట్లు చెప్పింది.