సవాల్‌‌కు సై! మిడిలార్డర్‌‌‌‌ ప్రయోగంలో రుతురాజ్ పాస్‌‌

సవాల్‌‌కు సై! మిడిలార్డర్‌‌‌‌ ప్రయోగంలో రుతురాజ్ పాస్‌‌

సౌతాఫ్రికాతో రెండో వన్డేలో భారీ స్కోరు కాపాడుకోలేక టీమిండియా ఓడిపోయినా.. రాయ్‌‌పూర్‌‌‌‌ గడ్డపై మన జట్టుకు ఓ ఆణిముత్యం దొరికింది. డొమెస్టిక్ క్రికెట్, ఐపీఎల్‌‌లో ఓపెనర్‌‌‌‌గా తనదైన ముద్ర వేసిన రుతురాజ్ గైక్వాడ్‌‌.. అనూహ్యంగా మిడిలార్డర్‌‌‌‌లో బరిలోకి దిగిన  రెండో మ్యాచ్‌‌లోనే సెంచరీతో సత్తా చాటాడు. టన్నుల కొద్దీ టాలెంట్ ఉన్నా.. ఇన్నాళ్లూ సరైన అవకాశాలు రాక నిరాశచెందిన గైక్వాడ్‌‌ రాయ్‌‌పూర్‌‌‌‌లో  ఆడిన ఇన్నింగ్స్ అతని కెరీర్‌‌‌‌ను మలుపు తిప్పడంతో పాటు జట్టుకు మరో అద్భుత ఆటగాడిని అందించేలా ఉంది. నిజానికి  సౌతాఫ్రికా సిరీస్‌‌కు టీమిండియాను ప్రకటించినప్పుడు, రుతురాజ్ గైక్వాడ్‌‌కు తుది జట్టులో చోటు దక్కుతుందని ఎవరూ పెద్దగా ఊహించలేదు. 

రోహిత్ శర్మతో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించేందుకు యంగ్‌‌స్టర్ యశస్వి జైస్వాల్‌‌కే ఫస్ట్ ప్రయారిటీ ఉంటుందని  రుతురాజ్ కేవలం బ్యాకప్ ఓపెనర్‌‌గానే ఉంటారని అంతా అనుకున్నారు. కానీ, టీమ్ మేనేజ్‌‌మెంట్ ప్రణాళికలు వేరుగా ఉన్నాయి. రాంచీ నెట్స్‌‌లో విరాట్ కోహ్లీతో కలిసి రుతురాజ్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయడం చూసినప్పుడే మేనేజ్‌‌మెంట్ ఆలోచనలో మార్పు ఉందని అర్థమైంది.  తీరా మ్యాచ్‌‌ రోజున తిలక్ వర్మను కాదని  అనూహ్యంగా అతడిని నాలుగో నంబర్‌‌‌‌లో బ్యాటింగ్‌‌కు పంపారు. తొలి వన్డేలో 14 బాల్స్‌‌ ఆడి కేవలం 8 రన్స్ మాత్రమే చేయడంతో  సోషల్ మీడియాలో హెడ్ కోచ్‌‌ గౌతమ్ గంభీర్‌‌‌‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. బ్యాటింగ్ ఆర్డర్‌‌తో ఇదో చెత్త,  వింత ప్రయోగం అంటూ కామెంట్స్ వినిపించాయి. ప్రూవెన్‌‌ ఓపెనర్‌‌‌‌ను మిడిలార్డర్‌‌‌‌ లో ఆడించడం ఏంటి? అని మాజీలూ ప్రశ్నించారు. కానీ రాయ్‌‌పూర్‌‌‌‌ రెండో వన్డేకు వచ్చే సరికి సీన్ రివర్సైంది. ఫైనల్‌‌ టీమ్‌‌ను మార్చకుండా.. కోచ్‌‌ గంభీర్‌‌‌‌, మేనేజ్‌‌మెంట్‌‌ రుతురాజ్‌‌ను మళ్లీ 4వ నంబర్‌‌‌‌లోనే ఆడించగా... ఈసారి తను సత్తా చాటాడు. 

కోహ్లీ సలహాలతో..

తన లిస్ట్–-ఎ కెరీర్లో 88 ఇన్నింగ్స్‌‌ల్లో  81 సార్లు ఓపెనర్‌‌గానే బరిలోకి దిగిన రుతురాజ్ తనకు ఏమాత్రం అలవాటు లేని స్థానంలో, కొత్త బాధ్యతలో అద్భుతంగా రాణించాడు.  క్లాసిక్ ఆటతో ఖతర్నాక్ సెంచరీ చేసి ఔరా అనిపించాడు.  83 బాల్స్‌‌లోనే 105 రన్స్ చేసి వన్డే కెరీర్‌‌లో తొలి సెంచరీ ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌‌లో తన సెంచరీ కంటే  సీనియర్ స్టార్ విరాట్ కోహ్లీతో కలిసి రుతురాజ్ ఇన్నింగ్స్ నడిపించిన తీరు హైలైట్‌‌గా నిలిచింది. ఈ ఇద్దరూ వికెట్ల మధ్య వేగంగా కదులుతూ, గ్యాప్స్ వెతుకుతూ స్కోరు బోర్డును పరుగెత్తించారు. ఇలా వికెట్ల మధ్య రన్నింగ్, పర్‌‌‌‌ఫెక్ట్ ప్లేస్‌‌మెంట్‌‌ షాట్లతో రన్స్ రాబట్టడంతో కోహ్లీ దిట్ట. 

ఐపీఎల్‌‌లో  సీఎస్కే తరఫున ఆడుతూ.. లెజెండరీ ప్లేయర్ ధోనీ నీడన ఎదిగిన రుతురాజ్‌‌కు ఈసారి కోహ్లీ రూపంలో మరో గురువు దొరికాడు. ఇన్నింగ్స్ ఆరంభంలో షాట్లు ఆడలేక, స్ట్రయిక్ రొటేట్ చేయడంలో ఇబ్బంది పడ్డ గైక్వాడ్‌‌కు అవతలి ఎండ్‌‌ నుంచి కోహ్లీ మార్గనిర్దేశం చేశాడు. కింగ్ సలహాలు, సూచనలు పాటించిన రుతు.. అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ముఖ్యంగా ఫిఫ్టీ తర్వాత పూర్తి ఆత్మవిశ్వాసంతో.. తనదైన స్టయిల్లో షాట్లు కొట్టాడు. కోహ్లీని దాటేసి వెళ్లి ముందుగానే సెంచరీ చేశాడు. ‘ కోహ్లీతో కలిసి బ్యాటింగ్ చేయడం, మంచి పార్ట్‌‌నర్‌‌‌‌షిప్ చేయడం ఒక కలలా అనిపిస్తోంది.  గ్రౌండ్‌‌లో తను నాకు మార్గనిర్దేశం చేశాడు. గ్యాప్స్ ఎలా వెతకాలి, బౌలర్ లెంగ్త్ ఎలా అంచనా వేయాలో చెప్పాడు. ఈ సిరీస్‌‌లో నన్ను నాలుగో స్థానంలో ఆడమని, నా సహజమైన ఆట ఆడమని కోచ్ గంభీర్ చెప్పాడు. ఈ సెంచరీ నా కెరీర్‌‌‌‌లో బెస్ట్ ఇనింగ్స్. గువాహటిలో నా తొలి టీ20 వంద  ఎలా గుర్తుండిపోయిందో తొలి వన్డే సెంచరీ కూడా నా గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతుంది’ అని రుతురాజ్ పేర్కొన్నాడు. ఈ సెంచరీ రుతురాజ్‌‌ను 2027 వన్డే వరల్డ్‌‌ కప్ రేసులో కచ్చితంగా ఉంచుతుంది. అయితే, వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ వంటి ఆటగాళ్లతో పోటీ పడి  తను ఫైనల్ ఎలెవన్‌‌లో చోటు నిలబెట్టుకోవడమే ఇకపై  గైక్వాడ్‌కు అసలు సవాల్‌ కానుంది.