
- పూణే కమిటీ రిపోర్ట్ మరింత ఆలస్యం
- స్టడీ కోసం రూ. కోటి కావాలంటూ ఎస్టిమేషన్
గద్వాల, వెలుగు: ర్యాలంపాడు రిజర్వాయర్ రిపేర్లు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. గతనెల రిజర్వాయర్‌ను పరిశీలించి పూణే బృందం రిపేర్లపై రిపోర్ట్ ఇవ్వకపోగా మరింత లోతుగా పరిశీలించాలని, ఇందుకోసం 15 రోజుల పాటు స్టడీ చేయాల్సిఉంటుందని, రూ. కోటి వరకు ఖర్చు అవుతుందని తేల్చిచెప్పింది. పూణే టీమ్ ప్రతిపాదనపై ప్రభుత్వం ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. గత నెల 10న పూణే కు చెందిన సెంటర్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్ బృందం .. ర్యాలంపాడు రిజర్వాయర్ లీకేజీలెలా అవుతున్నాయి, సీపేజీని ఎలా అరికట్టవచ్చు అన్న అంశాన్ని స్టడీ చేసింది.
సంజయ్ బూరెల్, సునీల్ పిళ్లై , నరసయ్య, డాక్టర్ మందిర, డాక్టర్ తనుశ్రీ తదితరుల బృందం ర్యాలంపాడ్, ముచ్చోనిపల్లి రిజర్వాయర్లను పరిశీలించింది. పూర్తిస్థాయిలో పరిశీలించి రిపేర్లపై నివేదిక ఇవ్వాలంటే కనీసం 15 రోజులు పడుతుందని, అన్ని రోజులు టీమ్ ఇక్కడ స్టే చేసి టెస్టులు చేసి రిపోర్ట్ తయారు చేయడానికి కనీసం రూ. కోటి ఖర్చు అవుతుందని ఇరిగేషన్ ఆఫీసర్లకు ఎస్టిమేషన్ ఇచ్చారు.
నెట్టెంపాడు లిఫ్ట్ స్కీమ్‌లో భాగంగా నిర్మించిన ర్యాలంపాడు, ముచ్చోనిపల్లి రిజర్వాయర్లను సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ పూణే టీం గతనెల 10న విజిట్ చేసింది. ర్యాలంపాడు బండ్ (ఆనకట్ట) అప్ స్ట్రీమ్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. డౌన్ స్ట్రీమ్ లో ఆనకట్ట రెండువైపులా ఎక్కడెక్కడ లీకేజ్ అవుతుందో పరిశీలించారు. బండ్ డౌన్ స్ట్రీమ్ లో జియలాజికల్, సాయిల్ కండిషన్, డ్యాం కెనాల్స్, రాక్ మెకానిక్స్, ఎమర్జెన్సీ యాక్షన్ ప్లాన్ తదితర అంశాలకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉందని బృందం స్పష్టం చేసింది.
రిపేర్లపై గత ప్రభుత్వం నిర్లక్ష్యం
ర్యాలంపాడు రిజర్వాయర్ లోపాలను 2019 లోనే గుర్తించారు. అయినా అప్పటి ప్రభుత్వం రిపేర్లపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నెట్టెంపాడు లిఫ్టులో ర్యాలంపాడే పెద్ద రిజర్వాయర్ ర్యాలంపాడ్. దీని కెపాసిటీ 4 టీఎంసీలు. ఆనకట్టకు బుంగలు పడి లీకేజీ అవుతుండడంతో 2019 నుంచి రెండు టీఎంసీలు మాత్రమే నిల్వ చేస్తున్నారు. దీంతో పూర్తి ఆయకట్టుకు నీరు అందించలేకపోతున్నారు. అప్పటి ప్రభుత్వం కమిటీల పేర జాప్యం చేసిందని రైతులు ఆరోపిస్తున్నారు.
ర్యాలంపాడ్ రిపేర్ల కోసం రూ. 144 కోట్లు అవసరమని అంచనా వేసినా.. రిపేర్లు ఎలా చేయాలో స్పష్టత లేకపోవడంతో ముందడుగు పడలేదు. పూణే కమిటీ సరైన పరిష్కారం చూపుతుందని ఆశించగా వాళ్లు కూడా మరింత లోతుగా స్టడీ చేయాలని చెప్పడంతో రిపేర్లు ఇంకా డిలే కానున్నాయి. ఎండాకాలం తర్వాత రిపేర్లు చేయడానికి అవకాశముండదు. మళ్లీ నీళ్లు ఎత్తిపోసుకోవాల్సివస్తుంది. ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలుతీసుకోవాలని రైతులు
కోరుతున్నారు.
ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాం
పూర్తిస్థాయి పరిశీలన కోసం పూణే కమిటీ ఇచ్చిన ఎస్టిమేషన్ ను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాం. త్వరలోనే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది. కమిటీ నివేదిక ఇచ్చినా ఇవ్వకపోయినా రిపేర్లపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుంది.
రహీముద్దీన్, ఎస్ సి, ఇరిగేషన్ శాఖ