తెలంగాణలో రేపటి నుంచి రైతు బంధు

V6 Velugu Posted on Jun 14, 2021

  • వానాకాలంలో కోటిన్నర ఎకరాలకు రూ.7,508 కోట్లు
  • 63.25 లక్షల మంది రైతుల అకౌంట్లలోకి నగదు బదిలీ
  • నల్గొండ జిల్లాకు అత్యధికంగా  రూ.608.81కోట్లు
  • మేడ్చల్ మల్కాజ్‌గిరికి అత్యల్పంగా రూ.38.39 కోట్లు
  • తక్కువ భూమి ఉన్నోళ్లకే మొదటగా డబ్బులు డిపాజిట్
  • ఈ నెల 25 నాటికి అర్హులందరికీ సాయం అందజేత

వానాకాలం పంటకు రైతు బంధు సాయం మంగళవారం నుంచి అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా కోటి 50 లక్షల 18వేల ఎకరాలకు సంబంధించి 63.25 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ చేయనుంది. ఈ మేరకు రైతులు, భూముల వివరాలతో లిస్ట్‌‌‌‌ను సీసీఎల్ఏ..  వ్యవసాయ శాఖకు అందించింది. ఆ లిస్ట్‌‌‌‌ ప్రకారం 63 లక్షల 25 వేల 695 మంది రైతుల ఖాతాల్లో రూ.7508.78 కోట్లను రైతుబంధు సాయం కింద జమ చేయనున్నారు. 2021–22 బడ్జెట్‌‌‌‌లో  వానాకాలం, యాసంగి సీజన్లలో రైతు బంధు కోసం రూ.14,800 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. ఈ నిధుల్లో నుంచి ఆర్థికశాఖ వానాకాలం సాయానికి అవసరమైన రూ.7508.78 కోట్ల నిధులు మంజూరు చేసింది. నేషనల్ పోర్టల్ ద్వారా రోజువారీగా నిధులను రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నగదు బదిలీ చేయనున్నారు.

మొదటి రోజు ఎకరాలోపు రైతులకే..

రైతు బంధు అందించే మొదటి రోజున విడుదల చేసే నిధుల్లో ఎకరాలోపున్న రైతులకే ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరుసటి రోజు నుంచి రోజుకు ఒక్కో ఎకరా పెంచుకుంటూ ఈ నెల 25 వరకు అర్హులైన రైతులందరి ఖాతాల్లో నిధులు జమ చేస్తారు. ఉన్న భూమిలో కొంత అమ్ముకోవడంతో కొత్తగా వాటిని కొన్న వాళ్లు రైతు బంధుకు అర్హత సాధించడంతో యాసంగి కన్నా ఇప్పుడు 2.81 లక్షల మంది రైతులు అదనంగా ఈ వానాకాలంలో రైతుబంధు సాయం అందుకోనున్నారు. అలాగే పార్ట్–బీలోనివి పరిష్కారమై పార్ట్–ఏలోకి చేరడంతో కొత్తగా మరో  66,311 ఎకరాలు రైతు బంధు సాయం పొందే వీలు కలిగింది.
 
నల్గొండ టాప్.. అట్టడుగున మేడ్చల్ మల్కాజ్​గిరి

ఎప్పటిలాగే ఈసారీ  రైతు బంధులో అత్యధికంగా నిధులు సాధించిన జిల్లాగా నల్గొండ నిలిచింది. ఈ జిల్లాలో 4,72,983 మంది రైతు బంధుకు అర్హత సాధించారు. వీరి ఆధీనంలో 12.18 లక్షల ఎకరాలు  ఉన్నాయి.  నల్గొండ జిల్లా రైతులకు అత్యధికంగా రూ.608.81 కోట్ల నిధులు విడుదలైయ్యాయి. వానాకాలం రైతు బంధు నిధులను అత్యల్పంగా రూ.38.39 కోట్లు మాత్రమే సాధించి మేడ్చల్ మల్కాజ్‌‌‌‌గిరి అట్టడుగున నిలిచింది. ఈ జిల్లాలో 39,762 మంది రైతుబంధుకు అర్హుత సాధించగా, వారి ఆధీనంలో77 వేల ఎకరాలు మాత్రమే ఉంది. మేడ్చల్‌‌‌‌తో పాటు వరంగల్​ అర్భన్, ములుగు జిల్లాలకు రూ.100 కోట్ల లోపు నిధులు వచ్చాయి. ఇక తక్కువ రైతుబంధు అందుతున్న రెండో జిల్లాగా ములుగు జిల్లా నిలిచింది. ఈ జిల్లాలో  77 వేల ఎకరాలతో  72,399 మంది రైతులు అర్హత సాధించగా,  రూ.77.76 కోట్ల నిధులు అందనున్నాయి. తర్వాతి స్థానంలో వరంగల్ అర్బన్ నిలిచింది. ఈ జిల్లాలో 97,612 మంది ఆధీనంలో 1.96  లక్షల ఎకరాలుండగా రూ.98.18 కోట్ల నిధులు విడుదల అయ్యాయి.
 

Tagged Telangana, rythu bandhu, Tomorrow, Distribution

Latest Videos

Subscribe Now

More News