సిద్దిపేట జిల్లా నర్మెటలో అట్టహాసంగా రైతు మేళా..హాజరైన మంత్రులు

సిద్దిపేట జిల్లా నర్మెటలో అట్టహాసంగా రైతు మేళా..హాజరైన మంత్రులు
  • హాజరైన మంత్రులు, అసెంబ్లీ స్పీకర్‌, మండలి చైర్మన్‌, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
  • వివిధ శాఖల ఆధ్వర్యంలో 150 స్టాళ్లు ఏర్పాటు
  • 22న పామాయిల్‌ ఫ్యాక్టరీని ప్రారంభించనున్న సీఎం రేవంత్‌రెడ్డి
  • సిద్దిపేట జిల్లా నర్మెటలో మూడు రోజుల పాటు కొనసాగనున్న ఉత్సవాలు

సిద్దిపేట, వెలుగు :  సిద్దిపేట జిల్లా నర్మెటలో పామాయిల్‌ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం సందర్భంగా మూడు రోజుల పాటు నిర్వహించే రైతు మహోత్సవం గురువారం ప్రారంభమైంది. సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, వివేక్‌ వెంకటస్వామి, వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్‌, అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌, శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎంపీ రఘునందన్‌రావు, సిద్దిపేట, దుబ్బాక ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్‌, యాదవరెడ్డి హాజరయ్యారు.

వేడుక ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను ఓపెన్‌ చేసి ఉత్సవాలను ప్రారంభించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయిల్‌పామ్‌ సాగు చేస్తున్న మహిళా రైతు చంద్రకళను స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ సన్మానించారు. అనంతరం వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 150 స్టాళ్లను పరిశీలించారు.

డిమాండ్‌ ఉన్న పంటలనే సాగు చేయాలి : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

రైతులు డిమాండ్‌ ఉన్న పంటలను సాగు చేసి లాభాలు పొందాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రైతు కుటుంబాలు ఆర్థికంగా బాగుపడినప్పుడే బంగారు తెలంగాణ సాధ్యం అవుతుందన్నారు. పామాయిల్‌ ఫ్యాక్టరీ ప్రారంభం చారిత్రాత్మకమైనదని, తాను మంత్రి కాగానే మొదటి సంతకం పామాయిల్‌ ఫ్యాక్టరీ ప్రారంభంపైనే చేసి 16 నెలల్లోనే పనులను పూర్తి చేసినట్లు చెప్పారు. అన్ని పార్టీలు ఏకతాటికి పైకి వచ్చి హరిత తెలంగాణకు చేయూతనివ్వాలని పిలుపునిచ్చారు. పామాయిల్‌ ఫ్యాక్టరీని అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించామని, వేస్టేజ్‌ ద్వారా నాలుగు మెగావాట్ల విద్యుత్‌ను సైతం ఉత్పత్తి చేసుకోవచ్చన్నారు.

తెలంగాణకు కేంద్రబిందువైన సిద్దిపేటలోనే ఆయిల్ రిఫైనరీ యూనిట్‌ను సైతం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితుల్లో వరి సాగుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ఒక్క పామాయిల్‌ మొక్క నుంచి 40 సంవత్సరాల పాటు దిగుబడి వస్తుందని, ఎకరానికి రూ. 51 వేలు సబ్సిడీ రావడంతో పాటు మొక్కలు, డ్రిప్స్‌, మందులు ఫ్రీగా ఇస్తున్నామని చెప్పారు. రైతుల ముఖాల్లో చిరునవ్వు చూడడమే మన లక్ష్యమన్నారు. 

ఆయిల్‌పామ్‌ సాగుపై ప్రత్యేక కార్యాచరణ : మంత్రి వాకిటి శ్రీహరి

రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఆయిల్‌పామ్‌ సాగు చేసేలా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని మంత్రి వాకిటి శ్రీహరి సూచించారు. ఇప్పటికే ఆయిల్‌పామ్‌ సాగు చేస్తున్న రైతులు ఇతర రైతులకు అవగాహన కల్పించాలన్నారు. రైతులు సుభిక్షంగా ఉండాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పమని చెప్పారు. 25 లక్షల మంది రైతులకు రూ. 21 వేల కోట్ల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ సర్కార్‌దేనన్నారు. మూడు రోజుల పాటు నిర్వహించే మేళాకు రైతులు భారీ సంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చారు. 

దిగుమతితో దేశానికి ఆర్థికంగా నష్టం : మంత్రి పొన్నం ప్రభాకర్

దేశవ్యాప్తంగా రూ. లక్ష కోట్ల విలువైన పామాయిల్‌ను దిగుమతి చేసుకోవడం వల్ల పెద్ద ఎత్తున విదేశీ మారకద్రవ్యాన్ని నష్టపోతున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. ఆయిల్‌పామ్‌లో అంతర పంటల సాగును కేంద్రం ప్రోత్సహిస్తోందని చెప్పారు. రాష్ట్రంలో ఆయిల్‌ పామ్‌ సాగు పెరగడానికి తుమ్మల నాగేశ్వరరావు కృషి చేస్తున్నారని కొనియాడారు. రాజకీయాలకతీతంగా రైతు సంక్షేమానికి కృషి చేస్తామని స్పష్టం చేశారు.

ఆయిల్‌పామ్‌ సాగుతో రైతుల ఆర్థికాభివృద్ధి : స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌

ఆయిల్‌పామ్‌ సాగుతో రైతుల ఆర్థికాభివృద్ధి సాధ్యం అవుతుందని, ఈ సాగు వల్ల ఇతర దేశాల నుంచి పామాయిల్‌ దిగుమతిలో ఇబ్బందులు తొలగిపోతాయని స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌ చెప్పారు. తెలంగాణ కోసం పోరాడి కలను నిజం చేసుకున్న కాకా వెంకటస్వామి, ప్రొఫెసర్‌ జయశంకర్‌ల మాదిరిగానే... పామాయిల్‌ సాగు కోసం కృషి చేస్తున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కల సైతం నిజం అవుతుందన్నారు. తాను ప్రాతినిధ్యం వహించే వికారాబాద్‌ నియోజకవర్గంలో సుమారు 3 వేల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ సాగు జరుగుతోందన్నారు. 

స్వల్ప ఉద్రిక్తత

నర్మెట రైతు మేళా ప్రారంభోత్సవ కార్యక్రమంలో బీఆర్ఎస్, కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేయడంతో స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది. స్టాల్స్‌ ప్రారంభ కార్యక్రమానికి ఎమ్మెల్యే హరీశ్‌రావు హాజరుకావడంతో బీఆర్ఎస్‌ కార్యకర్తలు పెద్దఎత్తున నినాదలు చేయగా.. కాంగ్రెస్‌ శ్రేణుల సైతం పోటీగా నినాదాలు ప్రారంభించారు. ఆయిల్ ఫెడ్ ఫ్లెక్సీల్లో హరీశ్‌రావు ఫొటో లేదని కొందరు బీఆర్ఎస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరుపార్టీల కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేయడంతో పోలీసులు వచ్చి వారిని సముదాయించడంతో గొడవ సద్దు మణిగింది. 

ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలి : గుత్తా సుఖేందర్‌రెడ్డి

రైతులు సంప్రదాయ పంటలే కాకుండా లాభాలిచ్చే ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి సూచించారు. ఆయిల్‌పామ్‌లో అంతర పంటలను సాగు చేసి ఆదాయాన్ని పొందవచ్చన్నారు. వరి దిగుబడి ఎక్కువగా వస్తుండడంతో అమ్ముకునే విషయంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని, దీనిని నివారించేందుకు ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపాలన్నారు. ఆయిల్‌పామ్‌ సాగు పెరిగితే ఇతర దేశాల నుంచి పామాయిల్‌ దిగుమతిని తగ్గించుకోవచ్చని చెప్పారు.