50 ఎకరాల వెంచర్​కు రైతుబంధు

50 ఎకరాల వెంచర్​కు రైతుబంధు
  • మంచిర్యాల జిల్లా భీమారంలో ‘నందనం ఇన్ ఫ్రా’ పేరుతో ప్లాట్లు 
  • ఇప్పటికీ వ్యవసాయ భూములుగానే రికార్డులు 

మంచిర్యాల, వెలుగు:  మంచిర్యాల జిల్లాలో రియల్ ఎస్టేట్ వెంచర్ కు కూడా రైతుబంధు అందుతున్నది. జిల్లాలోని భీమారం మండలం గొల్లవాగు ప్రాజెక్టు సమీపం లో కొందరు రియల్టర్లు 15,16,17తో పాటు మరికొన్ని సర్వే నంబర్లలో దాదాపు 50 ఎకరాలు కొనుగోలు చేశారు. రెండేండ్ల కిందట ‘నందనం ఇన్​ఫ్రా’ పేరుతో రియల్ ఎస్టేట్ వెంచర్ ఏర్పాటు చేశారు.

5 గుంటల చొప్పున ప్లాట్లు చేసి రూ.18 లక్షలకు అమ్ముతున్నారు. అంటే గజానికి రూ.3 వేలు, గుంటకు రూ.3.60 లక్షల చొప్పున విక్రయిస్తున్నారు. అయితే ఆ ప్లాట్లను కొనుగోలుదారులకు వ్యవసాయ భూముల కిందనే రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. నాలా కన్వర్షన్​చేయకపోవడం వల్ల వాళ్లకు రైతుబంధు స్కీమ్​కింద పెట్టుబడి సాయం అందుతోంది.

లక్షలు పెట్టి ఇక్కడ ప్లాట్లు కొంటున్న ప్రభుత్వ, ప్రైవేట్, సింగరేణి​ ఉద్యోగులు, బడా వ్యాపారులు, డాక్టర్లు కూడా రైతులుగా గుర్తింపు పొంది రైతుబీమాకు అర్హులవుతున్నారు. కాగా, గొల్లవాగు ప్రాజెక్టుకు వెళ్లే రోడ్డును వెంచర్​కు వాడుకుంటున్నారు. వెంచర్​ముందు భాగంలో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి వెంచర్​లోకి రోడ్డు వేసుకున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. 

మాజీ మంత్రి పేరుతో బెదిరింపులు.. 

ఈ వెంచర్​నిర్వాహకులు ఓ మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే పేరును వాడుకుంటున్నారు. ఆ మాజీ మంత్రి తమ బంధువని చెబుతూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో ఈ వెంచర్​పై ఫిర్యాదులు రావడంతో అప్పటి మంచిర్యాల ఆర్డీవో దాసరి వేణు విచారణకు వెళ్లారు. కొంతమంది బీఆర్ఎస్​లీడర్లు జోక్యం చేసుకొని ఎంక్వయిరీని తొక్కిపెట్టినట్టు సమాచారం.