
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్‌లో మూడో రోజు టాప్ సీడ్ ప్లేయర్లంతా అంచనాలను అందుకున్నారు. మంగళవారం జరిగిన విమెన్స్ తొలి రౌండ్‌లో బెలారస్ స్టార్ ప్లేయర్ ఆరీనా సబలెంక 6–1, 6–2తో ఎరికా ఆండ్రీవా (రష్యా)పై గెలిచి రెండో రౌండ్‌లోకి అడుగుపెట్టింది. 1 గంటా 8 నిమిషాల మ్యాచ్‌లో సబలెంక సర్వీస్‌ల్లో అదరగొట్టింది. 65 శాతం పాయింట్లను సాధించింది.
ఆరు బ్రేక్ పాయింట్లలో ఐదింటిని కాచుకుంది. ఒకే ఒక్క ఏస్ కొట్టిన బెలారస్ ప్లేయర్ ఒక డబుల్ ఫాల్ట్ మాత్రమే చేసింది. ఇతర మ్యాచ్‌ల్లో నాలుగోసీడ్ ఎలీనా రిబాకిన (కజకిస్తాన్) 6–2, 6–3తో గ్రీత్ మినెన్ (బెల్జియం)పై, ఏడోసీడ్ క్విన్‌వెన్ జాంగ్ (చైనా) 6–2, 6–1తో అలీజ్ కార్నెట్ (ఫ్రాన్స్)పై, పదోసీడ్ కసాట్కినా (రష్యా) 7–5, 6–1తో మాగ్దలెనా ఫ్రీచ్ (పోలెండ్)పై నెగ్గి సెకండ్ రౌండ్‌లోకి ప్రవేశించారు. మెన్స్ సింగిల్స్ తొలి రౌండ్‌లో కాస్పర్ రూడ్ (నార్వే) 6–3, 6–4, 6–3తో క్వాలిఫయర్ మెలిగ్నెని అల్విన్ (బ్రెజిల్)పై, అలెక్స్ డి మినుర్ (ఆస్ట్రేలియా) 6–1, 6–0, 6–2తో మిచెల్‌సెన్ (అమెరికా)పై, టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా) 2–6, 6–1, 6–2, 6–1తో ఫెడెరికో కొరియా (అర్జెంటీనా)పై నెగ్గాడు.