సబితక్క మోసం చేసింది: సీఎం రేవంత్ రెడ్డి

సబితక్క మోసం చేసింది: సీఎం రేవంత్ రెడ్డి
  • నాకు అండగా ఉంటానని చెప్పి.. బీఆర్ఎస్ లో చేరింది
  • ఆ అక్కలను నమ్ముకుంటే మోసపోవుడేనని కామెంట్
  • సీఎం వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలఆందోళన.. సభలో గందరగోళం 
  • పార్టీ మారొద్దు అని చెప్పినా సబిత వినలేదు: భట్టి   
  • నన్ను టార్గెట్ చేశారు: సబిత

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు గందరగోళానికి దారితీశాయి. బుధవారం ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ‘‘వెనకాల ఉండే అక్కలు ఇక్కడ ఉండి చెప్పి చెప్పి.. ఇక్కడ ముంచినాకే అక్కడ తేలిన్రు. ఆ అక్కల మాటలు వింటే జూబ్లీ బస్టాండ్​లో కూర్చోవాల్సి వస్తుంది” అని కేటీఆర్ కు సూచించారు. 

ఈ క్రమంలో రేవంత్​వ్యాఖ్యలపై బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన చేస్తూ వెల్​లోకి దూసుకెళ్లారు. ఈ సమయంలో మంత్రి సీతక్క కలుగజేసుకుని.. ‘‘కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ నేతలు గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. గతంలో కాంగ్రెస్​లో గెలిచి, బీఆర్ఎస్​లో చేరిన సబితా ఇంద్రారెడ్డితోనే ఆ ఫిర్యాదు ఇప్పించారు. ఒకరిద్దరు మహిళలు ‘మీతో ఢిల్లీకి వస్తున్నా అని చెప్పి’.. రాహుల్​గాంధీ దగ్గర టైమ్ తీసుకున్న తర్వాత ఏం మోసం చేసిన్రో, ఏం బాధ పెట్టిన్రో తెలిసే సీఎం రేవంత్​రెడ్డి ఆ సూచన చేశారు” అని అన్నారు. పదేండ్లు కాంగ్రెస్​లో మంత్రి పదవులు అనుభవించి.. ఇప్పుడు సభలో ఏవేవో మాట్లాడుతూ, తిడుతూ చప్పట్లు కొడుతారా అంటూ సీతక్క మండిపడ్డారు. 

మేమేం మోసం చేసినం: సబితా ఇంద్రారెడ్డి 

సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. సీఎం రేవంత్​రెడ్డి ఏ పార్టీ నుంచి వచ్చారు ? ఏ పార్టీ నుంచి ఎక్కడ చేరారు? అని ప్రశ్నించారు. దీనిపై చర్చ పెట్టాలన్నారు. ‘‘రేవంత్​రెడ్డి సీఎం అయ్యాక కేసీఆర్ ఇంటి మీద వాలిన కాకి.. తన ఇంటి మీద వాలితే కాల్చేస్త అన్నారు. మరి ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్​లో ఎందుకు చేర్చుకున్నారు. ఆనాడు ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వస్తుంటే అక్కగా నేను అశీర్వదించాను. 

చాలా గొప్ప నాయకుడిగా ఎదుగుతావని, సీఎం అవుతావని చెప్పాను. కానీ ఇప్పుడు నన్ను ఎందుకు టార్గెట్ చేశారో అర్థం కావడం లేదు. ‘వెనుక కూర్చున్న అక్కలను నమ్మవద్దు.. మోసం చేస్తారు’ అని సీఎం అన్నారు. మేం ఏం మోసం చేసినం? ఏం ముంచినం? బతిమిలాడి పార్టీలోకి రా తమ్ముడా అని ఆహ్వానించిన” అని అన్నారు. రేవంత్ ​తన మాటలను విత్​డ్రా చేసుకోవాలని కోరారు. 

మోసం చేసింది కాబట్టే నమ్మొద్దు అన్నాను: సీఎం రేవంత్ 

సబితా ఇంద్రారెడ్డి మాట్లాడిన తర్వాత మళ్లీ సీఎం రేవంత్ మాట్లాడారు. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు వ్యక్తిగత సంభాషణ, చర్చ ఉంటుందని ఆయన చెప్పారు. సబితక్క తనను కాంగ్రెస్ లోకి రమ్మని, పెద్ద లీడర్ అవుతావని చెప్పిన మాటలు వాస్తవమేనని తెలిపారు. కానీ ఇద్దరి మధ్య జరిగిన వ్యక్తిగత సంభాషణను సబితక్క సభలో చెప్పారని, ఇప్పుడు తాను దానికి కొనసాగింపుగా చెప్పాల్సి వస్తుందన్నారు. 

‘‘సబితా ఇంద్రారెడ్డిని సొంత అక్కగానే భావించి.. కుటుంబ సంబంధాలు, రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ లో చేరాను. కొడంగల్​లో ఓడిపోయిన తర్వాత 2019లో మల్కాజ్​గిరి ఎంపీ స్థానానికి పార్టీ పోటీ చేయిమన్నప్పుడు.. ఎన్నికల్లో అండగా నిలబడతానని సబితక్క అప్పుడు నాకు మాట ఇచ్చారు. కానీ తర్వాత కేసీఆర్​మాయమాటలు నమ్మి, అధికారం కోసం కాంగ్రెస్​ ను వదిలి బీఆర్ఎస్​లో చేరి మంత్రి పదవి పొందారు. తమ్ముడా పార్టీలోకి రా అని చెప్పి, చివరకు మోసం చేసింది. కాబట్టే ఆమెను నమ్మొద్దు అని కేటీఆర్​కు చెప్పాను” అని రేవంత్ అన్నారు. 

స్వార్థం కోసం పార్టీ మారారు: భట్టి  

పార్టీ మారి పరువు తీసి, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి.. ఇంకా ఆవేదన చెందుతున్నామని, బాధపడుతున్నామని అంటే ఎట్లా? అని సబిత ఇంద్రారెడ్డిని ఉద్దేశించి డిప్యూటీ సీఎం భట్టి అన్నారు. ఏ మొహం పెట్టుకుని ఇంకా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘సబితా ఇంద్రారెడ్డిని 2004కు ముందు కాంగ్రెస్ లో చేర్చుకుని ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చారు. తర్వాత పార్టీ అధికారంలోకి రావడంతో ఆమెకు మంత్రి పదవి ఇచ్చారు. 2009లో మళ్లీ మంత్రిగా అవకాశం ఇచ్చారు. 2014లో కూడా ఆమెకు కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది. అయితే ఆ టైమ్ లో పార్టీ అధికారాన్ని కోల్పోయింది.

 ఆ సమయంలో నన్ను ప్రతిపక్ష నేతను చేశారు. అయితే దశాబ్ద కాలం మంత్రి పదవులు అనుభవించిన సబితా ఇంద్రారెడ్డి.. నా వెనుక ఉండి నన్ను ప్రతిపక్ష నేతగా నిలబెట్టాల్సింది పోయి, అధికారం కోసం పార్టీ మారారు. అప్పుడు నాతో సహా పలువురు నా యకులం ఆమె ఇంటికి వెళ్లి ‘పార్టీ మారొద్దు అమ్మ. మీరు పోతే ప్రతిపక్ష హోదా పోతుంది. పార్టీ పరువు పోతుంది. మీకు పార్టీ ఎంతో చేసింది.. భవిష్యత్తులోనూ చేస్తుంది. ఆలోచన చేయండి” అని బతిమిలాడాం. కానీ సబిత వినిపించుకోలేదు. తన స్వార్థం కోసం బీఆర్ఎస్ లో చేరారు” అని మండిపడ్డారు. 

గందరగోళం మధ్యే బిల్లు పాస్.. 

సీఎం రేవంత్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ సభ్యులు అసెంబ్లీలో ఆందోళనకు దిగారు. వెల్ లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. దీంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. మళ్లీ మధ్యాహ్నం 3:15 గంటలకు సభ మొదలైన తర్వాత కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన కొనసాగించారు. బీఆర్ఎస్​నేతల నిరసనకు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్​ మద్దతు ఇచ్చారు. అదే సమయంలో బీఆర్ఎస్​మహిళా ఎమ్మెల్యేలు సభలో కూర్చొని నిరసన వ్యక్తం చేశారు.

ఆ టైమ్ లో బీఆర్ఎస్​ఎమ్మెల్యే పాడి కౌశిక్​రెడ్డి ఫొటో తీశారు. సభా నియమాలకు విరుద్ధంగా ఫొటో తీయడం వివాదాస్పమైంది. కాగా, గందరగోళం మధ్యే ద్రవ్య వినిమయ బిల్లును అసెంబ్లీలో పాస్​చేశారు. స్పీకర్​ఎంత చెప్పినా బీఆర్ఎస్​ నేతలు వినకపోవడంతో బిల్లుపై చర్చను రద్దు చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బిల్లుపై రిప్లై ఇవ్వగా, ఆ వెంటనే బిల్లు పాసైనట్టుగా స్పీకర్​ప్రకటించారు. దీనిపై ఎంఐఎం ఫ్లోర్​లీడర్ అక్బరుద్దీన్ ఒవైసీ, బీజేఎల్పీ నేత మహేశ్వర్​ రెడ్డి నిరసన వ్యక్తం చేశారు.