బీజేపీ హయాంలో జరిగిన స్కాంలపై విచారణ జరపట్లే

బీజేపీ హయాంలో జరిగిన స్కాంలపై విచారణ జరపట్లే

 జైపూర్: అవినీతిపై తన పోరాటం కొనసాగుతుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్​ నేత, మాజీ డిప్యూటీ సీఎం సచిన్​ పైలట్​ స్పష్టంచేశారు. బీజేపీ హయాంలో రాష్ట్రంలో జరిగిన అవినీతిపై విచారణ జరుపుతామని ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత సర్కారుపై ఉందన్నారు. మాజీ సీఎం, బీజేపీ నేత వసుంధరా రాజే హయాంలో జరిగిన కుంభకోణాలపై విచారణకు డిమాండ్ చేస్తూ  జైపూర్​లోని షహీద్​ స్మారక్​వద్ద సచిన్​ పైలట్ మంగళవారం నిరసనకు దిగారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిరాహార దీక్ష చేశారు. రాజస్థాన్లో కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు గడిచినా.. ఇప్పటివరకు గత బీజేపీ సర్కారు అవినీతిపై విచారణ జరపలేదని మండిపడ్డారు. భూమాఫియా, మద్యం మాఫియా,  మైనింగ్​ మాఫియాలపై చర్యలు తీసుకోవాలని సీఎం అశోక్​ గెహ్లాట్​కు తాను రెండుసార్లు లేఖలు రాసినా స్పందించలేదన్నారు. రాజస్థాన్లో రూ.45 వేల కోట్ల మైనింగ్​ స్కాం జరిగిందని ఆరోపించారు.  గెహ్లాట్​ సర్కారు స్పందించకపోవడం వల్లే తాను ఆందోళనకు దిగాల్సి వచ్చిందని చెప్పారు. నిరసన దీక్షకు దిగొద్దని కాంగ్రెస్​ పార్టీ రాష్ట్ర, జాతీయ నాయకత్వం సచిన్​ పైలట్​ను హెచ్చరించింది. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ కార్యక్రమం నిర్వహించినా, దాన్ని పార్టీ వ్యతిరేక చర్యగా పరిగణిస్తామని చెప్పింది. అయినా పైలట్​ వెనక్కి తగ్గలేదు. ఈ కార్యక్రమం కోసం వేదిక వద్ద ఏర్పాటు చేసిన బ్యానర్లు, ఫ్లెక్సీలపై కాంగ్రెస్ పార్టీ​ జెండాలు కానీ, గుర్తు కానీ  కనిపించకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో సచిన్ ​పైలట్​ తన వర్గంతో కలిసి వేరుకుంపటి పెట్టుకోబోతున్నారా అనే కోణంలో రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 

సీఎం గెహ్లాట్​ 2030 ‘విజన్’​ వీడియో

రాజస్థాన్​ సీఎం అశోక్​ గెహ్లాట్​ మంగళవారం ఒక వీడియోను రిలీజ్​ చేశారు. 2030 నాటికి రాజస్థాన్​ను దేశంలో నెంబర్​ 1 స్థానంలో నిలిపేందుకు ఎటువంటి విజన్​తో రాష్ట్ర ప్రభుత్వం ముందుకుపోతున్నదనే విషయాన్ని అందులో వివరించారు. గత నాలుగేళ్ల బడ్జెట్​తో పాటు ‘‘బచత్​, రాహత్​, బఢత్​’’  నినాదంతో ఈ ఏడాది ప్రవేశపెట్టిన  బడ్జెట్​లు తన విజన్​ ప్లాన్​లో భాగమని సీఎం గెహ్లాట్​ చెప్పారు. ఇతర ఏ రాష్ట్రాల్లోనూ లేని స్కీమ్స్​ను రాజస్థాన్​లో అమలు చేస్తున్నానని వీడియోలో తెలిపారు.