
న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్ లోక్‌సభ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరగడంపై ఎన్నికల కమిషన్ హర్షం వ్యక్తం చేసింది. ఓటర్లలో చైతన్యం తీసుకురావడానికి ఎన్నికల కమిషన్ తీసుకున్న చర్యలు ఫలించాయని పేర్కొంది. త్వరలోనే అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియను ప్రారంభిస్తామని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు ఓటేసేందుకు పోల్ ప్యానెల్ ఎంతో ప్రోత్సహించిందని చెప్పారు. ‘‘పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేసేందుకు పెద్ద సంఖ్యలో యువత, మహిళలు సంతోషంగా ఓటింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. ప్రజలు ఉత్సాహంతో ఓటేయడం వల్ల ప్రజాస్వామ్య మూలాలు మరింత బలోపేతం అవుతున్నాయి. ఇదే ఉత్సాహంతో త్వరలో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియను ప్రారంభిస్తాం’’ అని రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. కాగా, రవాణా, భద్రతా కారణాల వల్ల జమ్మూకాశ్మీర్‌లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి నిర్వహించలేదు.