
రాష్ట్రాల్లో రాజ్యాంగ యంత్రాంగం వైఫల్యం చెందినప్పుడు గవర్నర్ నివేదికను ఆధారం చేసుకుని రాష్ట్రపతి కేంద్ర మంత్రి మండలిని సంప్రదించిన తర్వాత ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పరిపాలన విధించాలని రాజ్యాంగం పేర్కొంటున్నది. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుంచి 356 అధికరణ వినియోగం వివాదాస్పదంగానే పరిగణిస్తున్నారు. 1977లో జనతా ప్రభుత్వం 9 రాష్ట్రాల్లోని కాంగ్రెస్ ప్రభుత్వాలను రద్దు చేసి రాష్ట్రపతి పరిపాలన విధించగా, 1980లో ఇందిరాగాంధీ
ప్రభుత్వం 9 రాష్ట్రాల్లోని జనతా ప్రభుత్వాలను రద్దు చేసింది. 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత అనంతరం నాలుగు బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలను పి.వి.నర్సింహారావు ప్రభుత్వం రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించింది. 1994లో సుప్రీంకోర్టు 356 అధికరణ వినియోగంపై తీర్పునిస్తూ కర్ణాటకలో ఎస్.ఆర్. బొమ్మై ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పరిపాలన విధించడాన్ని నాగాలాండ్‌లో ఎస్.సి.జమీర్ ప్రభుత్వాన్ని రద్దు చేయడాన్ని సమాఖ్య స్ఫూర్తికి భంగం కలిగించే అంశంగా పేర్కొన్నది.
100 సార్లకు పైగా దుర్వినియోగం
2002లో రాజ్యాంగ పున: సమీక్ష కమిషన్ సమర్పించిన నివేదికలో మన దేశంలో నేటి వరకు 356వ అధికరణను 100 సార్లకు పైగా దుర్వినియోగం చేశారని పేర్కొనడం గమనార్హం. గవర్నర్ నివేదిక లేనిదే రాష్ట్రపతి పరిపాలన విధించరాదని సర్కారియా కమిషన్, రాజ్యాంగ పున: సమీక్ష కమిషన్, మదన్ మోహన్ పూంచీ కమిషన్లు పేర్కొన్నాయి.
ఉభయసభల ఆమోదం తప్పనిసరి
రాజ్యాంగ అత్యవసర పరిస్థితి విధిస్తూ రాష్ట్రపతి చేసిన ప్రకటనను పార్లమెంట్ ఉభయసభలు ఆమోదించిన తర్వాత మాత్రమే రాష్ట్ర విధానసభను రద్దు చేయాలి. రాష్ట్రపతి ప్రకటనను పార్లమెంట్ ఆమోదించకపోయినా లేక పార్లమెంటులోని ఏ ఒక్క సభ ఆమోదించకపోయినా రాష్ట్రపతి పరిపాలనను ఎత్తివేసి తిరిగి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని నెలకొల్పాలి.
రాజ్యాంగపరంగా సమస్యలు
రాష్ట్రపతి ప్రకటనను పార్లమెంట్ ఆమోదించిన సందర్భంలో రాష్ట్రపతి పాలనను రద్దు చేస్తున్నారు. కానీ అప్పటికి శాసనసభను రద్దు చేస్తే రాజ్యాంగపరంగా సమస్య ఎదురవుతుంది. రాష్ట్రపతి అత్యవసర పరిస్థితిని విధించినప్పుడు శాసనసభ రద్దయినా చేయవచ్చు లేదా సుప్తచేతనావస్థ(సస్పెండ్) అయినా చేయవచ్చు. సస్పెండ్ చేస్తే అదే సభను పునరుద్ధరించవచ్చు. కానీ రద్దు చేస్తే తిరిగి ఎన్నికలు నిర్వహించాలి. రాష్ట్రపతి రాష్ట్రంలో అత్యవసర పరిస్థితిని విధిస్తూ ప్రకటన చేసే సందర్భంలో విధానసభను రద్దు చేసినట్లు అయితే రాష్ట్రపతి ప్రకటనను పార్లమెంట్ ఆమోదించకపోయినా శాసనసభకు తిరిగి ఎన్నికలు నిర్వహించాలి.
శాసనసభ పదవీకాలం మిగిలి ఉన్నా సభకు తిరిగి ఎన్నికలు నిర్వహించాలి. 2000లో బిహార్‌లో విధించిన రాష్ట్రపతి పరిపాలనను లోక్‌సభ ఆమోదించినా రాజ్యసభ తిరస్కరించింది. బిహార్‌లో రాష్ట్రపతి పాలనను ఎత్తివేశారు. కానీ విధానసభ పదవీకాలం మిగిలి ఉన్నా మళ్లీ ఎన్నికలు జరపాల్సి వచ్చింది. కారణం శాసనసభను రాష్ట్రపతి రద్దు చేయడమే. సర్కారియా కమిషన్ చేసిన సూచన, అలాగే ఎస్.ఆర్. బొమ్మై కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం రాష్ట్రపతి ప్రకటనను పార్లమెంట్ ఆమోదించిన తర్వాత మాత్రమే ఆ రాష్ట్ర శాసనసభను రద్దు చేయాలి.
కారణం
ఒక రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం విఫలమైనప్పుడు రాజ్యాంగ అత్యవసర పరిస్థితిని విధిస్తారు. రాజ్యాంగ అత్యవసర పరిస్థితిని రాష్ట్రపతి పాలన, కేంద్ర పాలన అని కూడా అంటారు.
రాజ్యాంగ యంత్రాంగ వైఫల్యం అంటే..
1. శాంతి భద్రతలు క్షీణించడం.
2. రాష్ట్ర ప్రభుత్వాలు తరచూ పడిపోవడం.
3. ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పడకపోవడం.
4. ప్రభుత్వమే ఏర్పడకపోవడం
5. ప్రభుత్వం పనిచేయకపోవడం.
6. 365వ అధికరణం ప్రకారం కేంద్రం ఆదేశాలను రాష్ట్రాలు పాటించకపోవడం.