
కార్తికేయ, ఐశ్వర్య మీనన్ జంటగా ప్రశాంత్ రెడ్డి దర్శకత్వంలో యూవీ కాన్సెప్ట్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం ‘భజే వాయు వేగం’. మే 31న సినిమా విడుదల కానుంది. శనివారం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. కార్తికేయ మాట్లాడుతూ ‘నేను అనుకున్న కథ, ఎమోషన్, డ్రామా, క్యారెక్టర్ వందశాతం కుదిరిన సినిమా ఇది. ఆరేళ్ల నా సినీ కెరీర్‌లో ఒక పర్ఫెక్ట్ సినిమాతో నా అడుగు ముందుకు పడలేదని అనిపిస్తుంది. ఆ వెలితిని తీర్చే చిత్రమిది.
కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఈ కథలో సహజంగా కుదిరాయి. ‘ఆర్ఎక్స్ 100’ తర్వాత నా కెరీర్‌లో ఇది మరో బెంచ్ మార్క్ మూవీ అవుతుంది’ అని చెప్పాడు. ట్రైలర్ తరహాలోనే సినిమా కూడా అందరికీ నచ్చుతుందని హీరోయిన్ ఐశ్వర్య మీనన్ చెప్పింది. దర్శకుడు ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ‘ఓ సామాన్యుడు అసాధారణ సమస్యలో ఇరుక్కుని, దాన్నుంచి ఎలా బయటపడ్డాడు అనేది కథ. అన్నిరకాల ఎమోషన్స్ కలిపి ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లేతో చూపిస్తున్నాం’ అని చెప్పాడు. ఇంకా ఈ కార్యక్రమంలో యూవీ కాన్సెప్ట్స్ చైతన్య, డైలాగ్ రైటర్ మధు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.