దేవేందర్ రెడ్డిపై అనర్హత వేటు

దేవేందర్ రెడ్డిపై అనర్హత వేటు
  •     పీఏసీఎస్ మేనేజింగ్ కమిటీ పదవి నుంచి తొలగింపు 
  •     కోనాపూర్ సొసైటీ అక్రమాలపై శాఖాపరమైన చర్య 
  •     రూ.2.26 కోట్లు రికవరీ చేయాలని డీసీసీబీ తీర్మానం 

సంగారెడ్డి/మెదక్, వెలుగు: బీఆర్ఎస్ పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి భర్త ఎం. దేవేందర్ రెడ్డిపై అనర్హత వేటు పడింది. ఆయనను కోనాపూర్ పీఏసీఎస్ మేనేజింగ్ కమిటీ మెంబర్ (డైరెక్టర్) పదవికి అనర్హుడిగా ప్రకటిస్తూ జిల్లా కోఆపరేటివ్ ఆఫీసర్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలో సంగారెడ్డిలో శుక్రవారం జరిగిన ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ జనరల్ బాడీ మీటింగ్​లో దేవేందర్​రెడ్డిని డీసీసీబీ డైరెక్టర్ పదవి నుంచి తొలగించాలని సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. 

మెదక్ జిల్లా రామాయంపేట మండలం కోనాపూర్ పీఏసీఎస్ చైర్మన్ గా ఉన్న దేవేందర్ రెడ్డి నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్టు ఆ సొసైటీ డైరెక్టర్లు కోఆపరేటివ్ ఉన్నతాధికారులకు గతంలో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కోఆపరేటివ్ డిపార్ట్ మెంట్ ఆఫీసర్లు సెక్షన్ 51 కింద ఎంక్వైరీ చేశారు. ఇందులో వివిధ పద్దుల ద్వారా సొసైటీకి సమకూరిన ఆదాయంలో లోన్ మంజూరు, బిల్లుల చెల్లింపు తదితరాల్లో రూ.2.26 కోట్లు దుర్వినియోగం అయినట్టు గుర్తించారు. సొసైటీలో అవకతవకలపై దేవేందర్ రెడ్డి మీద వచ్చిన అభియోగాల నేపథ్యంలో కోఆపరేటివ్ నిబంధనల ప్రకారం ఆయనను కోనాపూర్ సొసైటీ డైరెక్టర్ పదవికి అనర్హుడిగా ప్రకటిస్తూ మెదక్ జిల్లా కోఆపరేటివ్ ఆఫీసర్ కరుణ ఈ నెల 22న ఉత్తర్వులు జారీ చేశారు. 

దీంతో సొసైటీ డైరెక్టర్ పదవికి అర్హత కోల్పోవడంతో దేవేందర్ రెడ్డి సొసైటీ చైర్మన్​పదవి, డీసీసీబీ డైరెక్టర్, ఇఫ్కో డైరెక్టర్ పదవిలోనూ కొనసాగే అవకాశం ఉండదని తెలిసింది. ఈ నేపథ్యంలో ఆయనను డీసీసీబీ డైరెక్టర్ పదవి నుంచి తొలగించాలని డీసీసీబీ జనరల్ బాడీ మీటింగ్​లో సభ్యులు తీర్మానం చేశారు. అంతేగాక కోనాపూర్​ సొసైటీలో దుర్వినియోగం అయిన రూ.2.26 కోట్లు రికవరీ చేయాలని కూడా తీర్మానం చేశారు.