- ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావత్
రాజన్నసిరిసిల్ల/ వేములవాడరూరల్, వెలుగు: ఓటర్ల జాబితా సవరణలో అప్రమత్తంగా ఉండాలని, ప్రజాస్వామ్య పరిరక్షణకు బీఎల్ఏలు సైనికుల్లా పనిచేయాలనీ ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావత్ పేర్కొన్నారు.. శుక్రవారం వేములవాడ పట్టణంలో టీపీసీసీ ఆధ్వర్యంలో ఎస్ఐఆర్ ప్రక్రియపై బూత్ లెవల్ ఏజెంట్లకు ప్రత్యేక అవగాహన, శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావత్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, రాష్ట్ర మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్, పీసీసీ పరిశీలకుడు గోపిశెట్టి రాఘవేందర్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఏఐసీసీ కార్యదర్శి మాట్లాడుతూ పన్నెండ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దేశ అభివృద్ధి కంటే రాజకీయ ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందని విమర్శించారు. దేశ అభివృద్ధికి పునాది వేసిన మాజీ ప్రధాని నెహ్రూ సేవలను గుర్తు చేస్తూ, ఆధునిక భారత నిర్మాణంలో ఆయన పాత్ర అపారమని పేర్కొన్నారు. విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా ప్రతి బూత్ స్థాయిలో కాంగ్రెస్ కార్యకర్తలు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. కాంగ్రెస్ అంటే బీజేపీ భయపడుతుందనీ, అందుకే మీనాక్షి నటరాజన్ రాజ్యసభ సీటు చోరీ చేసిందన్నారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, కేకే మహేందర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, పార్టీ పట్టణ అధ్యక్షుడు తూం మధు, ప్రజాప్రతినిధులు, పాల్గొన్నారు.
భీమన్న సేవలో ఏఐసీసీ కార్యదర్శి
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ భీమేశ్వర స్వామివారిని విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌తో కలిసి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి సచిన్ సావంత్ దర్శించుకున్నారు. స్వామివారికి కోడెమొక్కు చెల్లించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
