Sachin: వాంఖడే స్టేడియంలో సచిన్ ఎత్తంత విగ్రహాం

Sachin: వాంఖడే స్టేడియంలో సచిన్ ఎత్తంత విగ్రహాం

క్రికెట్ గాడ్ గా పేరొందిన సచిన్ టెండూల్కర్‌కు అరుదైన గౌరవం ఇవ్వాలని  ముంబై క్రికెట్ అసోసియేషన్  నిర్ణయించుకుంది. వాంఖడే స్టేడియంలో సచిన్ నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేయనుంది. ఏప్రిల్ 24న సచిన్ తన 50 పుట్టిన రోజును  జరుపుకోనున్నాడు. దీనికి ఒక్క రోజు ముందు అంటే 23వ తేదీన సచిన్ విగ్రహాన్ని  ఆవిష్కరించాలని ఎంసీఏ అధికారులు నిర్ణయించారు. 

ఇది నాకు చాలా ప్రత్యేకమైంది

వాంఖడే స్టేడియం తనకు ఎంతో ప్రత్యేకమైందని సచిన్ టెండూల్కర్ తెలిపాడు. తన కెరీర్లో వాంఖడేలోనే  తొలి రంజీ మ్యాచ్‌ ఆడానని..అంతేకాదు..చివరి అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఇక్కడే ఆడినట్లు గుర్తు చేశాడు.  క్రికెట్లో తనకు 25 ఏళ్ల అనుభవం ఉన్నా కూడా..ఎప్పటికీ 25 వయసు వ్యక్తిగా ఉన్నానని..అందుకు ఎంసీఏకు ధన్యవాదాలు చెప్తున్నట్లు సచిన్ తెలిపాడు. వాంఖడేలో తన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఎంసీఏ తనకు సమాచారం ఇచ్చిందని..తన జీవితంలో ఇది చాలా ప్రత్యేకమైన సందర్భమని సచిన్ పేర్కొన్నాడు. అందుకే విగ్రహం ఎలా ఉండాలి...స్టేడియంలో ఎక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి...అనే అంశాలపై చర్చించేందుకు వాంఖడేకు వచ్చినట్లు చెప్పాడు. 

వాంఖడేతో సచిన్ కు ప్రత్యేకమైన అనుబంధం...

వాంఖడేతో సచిన్ టెండూల్కర్ కు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. తన కెరీర్లో సచిన్ ఇక్కడే తొలి రంజీ మ్యాచ్ ఆడాడు.  ఇక్కడే సచిన్ తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడాడు. ఇక 2011లో వన్డే వరల్డ్ కప్  గెలిచి చిరకాల కోరికను నెరవేర్చుకున్నాడు. 

సచిన్ కెరీర్..

టెండూల్కర్ తన కెరీర్‌లో 200 టెస్టు మ్యాచులు, 463 వన్డేలు ఆడాడు. ఈ రెండు ఫార్మాట్లలో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అంతేకాదు క్రికెట్ చరిత్రలో 100 అంతర్జాతీయ సెంచరీలు కొట్టిన  ఏకైక  క్రికెటర్గా సచిన్ రికార్డు సృష్టించాడు.