గల్వాన్ అమరుల త్యాగాలు వృథా కానివ్వం

గల్వాన్ అమరుల త్యాగాలు వృథా కానివ్వం

ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్‌‌కేఎస్ భదౌరియా

న్యూఢిల్లీ: తూర్పు లడాఖ్‌లో చైనా దళాలతో జరిగిన ఘర్షణలో ప్రాణాలు అర్పించిన ఇండియా సైనికులది అద్భుతమైన చర్యగా ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్‌‌కేఎస్‌ భదౌరియా మెచ్చుకున్నారు. గల్వాన్ వ్యాలీలో మరణించిన మన సైనికులు దేశ సార్వభౌమత్వానికి ఎట్టి పరిస్థితుల్లోనూ భంగం కలిగించబోమని దృఢ సంకల్పాన్ని చూపించారని ప్రశంసించారు. లడాఖ్‌ను సందర్శించిన భదౌరియా.. బుధవారం లేహ్‌లోని ఫార్వర్డ్‌ ఎయిర్‌‌బేస్‌ వద్దకు వెళ్లారు. గురువారం ఆయన శ్రీనగర్‌‌లో పర్యటించనున్నారు. హైదరాబాద్‌లోని ఎయిర్‌‌ ఫోర్స్ అకాడమీలో జరిగిన కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్‌ (సీజీపీ)లో పాల్గొన్న సందర్భంగా భదౌరియా పలు విషయాలు మాట్లాడారు.

‘గల్వాన్ వ్యాలీలో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్‌ఏసీ)ను రక్షించుకోవడానికి ప్రాణాలు అర్పించిన కల్నల్ సంతోష్ బాబుతోపాటు ఆయన దళ సైనికులకు నివాళి అర్పించడంలో నాతో పాటు మీరూ జాయిన్ అవ్వండి. అతిపెద్ద సవాళ్లను విసిరే ఈ కఠిన పరిస్థితుల్లో.. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడటానికి వారు తమ ప్రాణాలు అర్పించారు. ఇప్పుడు ఆకస్మిక దాడులకు కూడా ప్రతిస్పందించడానికీ మేం సర్వసిద్ధంగా ఉన్నాం. గల్వాన్ అమర వీరుల త్యాగాలను వృథా కానివ్వం. మన ప్రాంతంలో ఆర్మీ ఫోర్సెస్ ఎల్లప్పుడూ ప్రిపేర్డ్‌గా ఉంటాయి. సైనిక చర్చల టైమ్‌లో కుదిరిన ఒప్పందాల ప్రకారం చైనా చర్య ఆమోదయోగ్యం కానప్పటికీ.. డ్రాగన్ కంట్రీతో ప్రస్తుత పరిస్థితిని పరిష్కరించడానికి అన్ని విధాలా యత్నాలు జరుగుతున్నాయి’ అని భదౌరియా పేర్కొన్నారు.