
- కొత్త జీపీవోలకు కీలక బాధ్యతలు
- మార్కెట్ ఫీజుపై క్లారిటీ వచ్చాక రెగ్యులరైజేషన్
- జిల్లాలో 25,335 సాదాబైనామా దరఖాస్తులు
నిజామాబాద్, వెలుగు: జిల్లాలో సాదాబైనామా దరఖాస్తులకు మోక్షం లభించనుంది. హైకోర్టు నుంచి క్లియరెన్స్ లభించడంతో ఈ నెల 10న ప్రభుత్వం జీవో 106 జారీ చేసింది. దీని ప్రకారం తెల్ల కాగితాలు, స్టాంప్ పేపర్స్‌పై భూములు కొనుగోలు చేసి 12 ఏండ్లుగా కబ్జాలో ఉన్న రైతులకు భూములను రెగ్యులరైజ్ చేయనున్నారు. రెవెన్యూ యంత్రాంగం క్షేత్రస్థాయిలో సర్వే చేపట్టి నివేదిక తయారు చేసే పనిలో నిమగ్నమయ్యారు.
క్రమబద్ధీకరణకు ఎంత ఫీజు తీసుకోవాలన్న దానిపై ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది. జిల్లాలో 25,335 సాదాబైనామా దరఖాస్తులు ఉండగా, ఆర్ఐ, తహసీల్దార్లు దర్యాప్తును ప్రారంభించారు. ఈ ప్రక్రియలో కొత్తగా చేరిన జీపీవోలు (గ్రామ పాలన అధికారులు) 291 మంది కీలక పాత్ర పోషించనున్నారు.
చిన్న, సన్నకారు రైతులకే..
తెలంగాణ ఏర్పడిన 2 జూన్ 2014కు ముందు సాదాబైనామా కింద వ్యవసాయ భూములు కొనుగోలు చేసి సాగు చేస్తున్నట్లయితే రెగ్యులరైజేషన్ చేస్తామని గత బీఆర్ఎస్ ప్రభుత్వం10 నవంబర్ 2020 వరకు దరఖాస్తులు స్వీకరించింది. ధరిణి స్కీమ్ ప్రారంభించిన సందర్భంగా సాదాబైనామాలు పరిష్కరిస్తామని ప్రకటించింది. అంతకు ముందు 2017లో ప్రభుత్వం సాదాబైనామాలు క్రమబద్ధీకరించింది. అదేపేరుతో మరోసారి దరఖాస్తులు కోరడాన్ని తప్పుబడుతూ కొందరు కోర్టుకు వెళ్లడంతో ప్రక్రియ ఆగిపోయింది.
గత వారం కోర్టు క్లియరెన్స్ ఇవ్వడంతో ప్రభుత్వం మళ్లీ దరఖాస్తుల విచారణకు ఆదేశాలు జారీ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి చట్టం కింద 2020 అక్టోబర్ 12 నుంచి ఆ ఏడాది నవంబర్ 10 వరకు సాదాబైనామా దరఖాస్తులను రెగ్యులరైజ్ చేస్తామని ప్రకటించింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కలిపి జిల్లాలో 25,335 దరఖాస్తులు ఉండగా, వాటికి మోక్షం లభించనుంది. సాదాబైనామా కింద గరిష్ఠంగా ఐదెకరాల్లోపు భూములు కొనుగోలు చేసిన చిన్న, సన్నకారు రైతులకు మేలు జరగనుంది.
12 ఏండ్ల సాగు తప్పనిసరి..
సాదాబైనామా పత్రాలతో చిన్న, సన్నకారు రైతులు భూములు సాగు చేస్తున్నారు. వారి పేరిట భూములు పట్టా లేకపోవడంతో ఇన్నాళ్లు రైతు భరోసా, పంట రుణాలు, బీమా ఇతర రాయితీలు అందడం లేదు.వారి పేరుతో పట్టాపాస్ పుస్తకాలు ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం క్షేత్రస్థాయిలో విచారణ చేయిస్తోంది. జిల్లాలో 320 క్లస్టర్లు ఏర్పాటు చేశారు. పది రోజుల కింద 291 మందికి జీపీవోలుగా పోస్టింగ్ ఇచ్చారు. వీరంతా క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి ప్రభుత్వానికి నివేదిక అందించనున్నారు. సాదాబైనామా పేపర్ ఉన్నప్పటికీ కొనుగోలు చేసిన భూమిలో రైతు గరిష్ఠంగా 12 ఏండ్ల నుంచి సాగు చేస్తున్న ఆధారాలను జీపీవోల ద్వారా సేకరించనున్నారు.
ఇందుకు పొరుగు రైతుల సాక్ష్యాలను నమోదు చేయనున్నారు. సర్వేయర్, ఆర్ఐ, తహసీల్దార్లు ఇందులో పాల్గొంటారు. విచారణ రిపోర్టు ఆర్డీవో/సబ్ కలెక్టర్ ఆన్‌లైన్‌కు లాగిన్ అయ్యాక రెగ్యులరైజేషన్ ఫీజు ఎంత కట్టాలో రైతులకు చెబుతారు. ఫీజు విషయాన్ని ప్రభుత్వం ఇంకా వెల్లడించలేదు. అప్పటి వరకు ఎంక్వైరీ పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించడంతో రెవెన్యూ యంత్రాంగం సిద్ధమైంది.