అబిడ్స్, వెలుగు: నాంపల్లిలోని లలిత కళాతోరణంలో తెలంగాణ పీపుల్స్ ఫ్రంట్ ఆధ్వర్యంలో గురువారం ‘సదువుల బతుకమ్మ’ వేడుకలు నిర్వహించారు. విద్యారంగ సమస్యలను ప్రతిబింబించేలా రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, విద్యావ్యవస్థను బలోపేతం చేయాలని సందేశమిచ్చారు. ఉస్మానియా యూనివర్సిటీకి రూ.1,000 కోట్లు, రాష్ట్ర బడ్జెట్లో విద్యాశాఖకు 18 శాతం నిధులు కేటాయించాలని కోరుతూ ప్రత్యేక బతుకమ్మలను ఏర్పాటు చేశారు.
నాణ్యమైన మధ్యాహ్న భోజనం, విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్లకార్డులు ప్రదర్శించారు. కార్యక్రమంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి, విద్యావేత్త ప్రొఫెసర్ శాంతా సిన్హా, ప్రొఫెసర్ పద్మజా షా, తల్లిదండ్రులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
