సద్గురుకు బ్రెయిన్ సర్జరీ .. నాలుగు వారాలుగా అస్వస్థత

సద్గురుకు బ్రెయిన్ సర్జరీ ..  నాలుగు వారాలుగా అస్వస్థత

న్యూఢిల్లీ :  ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గీ వాసుదేవ్​కు బ్రెయిన్ సర్జరీ జరిగింది. సర్జరీ విజయవంతంగా పూర్తయిందని ఢిల్లీ అపోలో ఆసుపత్రి డాక్టర్లు బుధవారం వెల్లడించారు. శస్త్రచికిత్స వివరాలను అపోలో హాస్పిటల్స్ న్యూరాలజిస్ట్ వినిత్ సూరి 'ఎక్స్' ద్వారా వివరించారు. "నాలుగు వారాలుగా సద్గురు తలనొప్పితో బాధపడుతున్నారు. అయినా, మహాశివరాత్రి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ నెల15 తర్వాత తలనొప్పి మరింత తీవ్రమైంది. దాంతో ఆయన ఆదివారం ఉదయం ఆసుపత్రికి వచ్చారు. మెడికల్ టెస్టులు  నిర్వహించి మెదడులో రక్తస్రావం జరిగిందని గుర్తించాం. మా వైద్య బృందం వెంటనే సర్జరీ చేసింది. ఊహించిన దానికంటే త్వరగా కోలుకుంటున్నారు. 

త్వరలోనే ఆయన సాధారణ జీవితం గడుపుతారు" అని వివరించారు. సద్గురు తన ఆరోగ్య పరిస్థితి గురించి మాట్లాడారు. దానికి సంబంధించిన వీడియోను ఇషా ఫౌండేషన్ తన సోషల్ మీడియా చానెల్స్ లో షేర్ చేసింది.ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్న జగ్గీ వాసుదేవ్ కు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. ఆయనతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఈ విషయాన్ని ప్రధాని తన 'ఎక్స్' ఖాతాలో వెల్లడించారు. జగ్గీవాసుదేవ్ ఆరోగ్యంగా ఉండాలని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ పోస్టు పెట్టారు.