సహనం అనే డీఎన్ఏ మాయమైంది

సహనం అనే డీఎన్ఏ మాయమైంది
  • ఇండియా, అమెరికాల్లో అదే పరిస్థితి
  • ప్రతిపక్షాల వాయిస్​ వినే ఓపిక మోడీకి లేదు
  • కరోనా తర్వాత పరిస్థితులను మనం దాటగలం
  • మన దేశ డీఎన్ఏను నేను అర్థం చేసుకోగలను
  • కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ: ఇండియా, అమెరికాలకు సహనం ఎక్కువ ఉన్న దేశాలుగా పేరుండేదని, ఇప్పుడు ఆ డీఎన్ఏ రెండు దేశాల్లోనూ కనుమరుగైందని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. ‘‘మన డీఎన్ఏలోనే సహనం అనేది ఉంది. అందుకే మనం కొత్త ఐడియాలను స్వాగతిస్తాం. అందుకే మనం ఓపెన్​గా ఉంటాం. కానీ ఆశ్చర్యకరంగా ఇప్పుడు ఆ డీఎన్ఏ కనుమరుగైంది. గతంలో నేను చూసిన స్థాయిలో ఇప్పుడు డీఎన్ఏ కనిపించడం లేదని చెప్పడానికి బాధగా ఉంది. అలాంటి డీఎన్ఏ అమెరికాలోనూ కనిపించడం లేదు. ఇండియాలోనూ కనిపించడం లేదు”అని రాహుల్​ చెప్పారు. అమెరికాకు చెందిన మాజీ డిప్లొమాట్, హార్వర్డ్​ ప్రొఫెసర్​ నికోలస్‌ బర్న్స్‌తో వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా జరిగిన డిస్కషన్​లో కరోనా మహమ్మారి వల్ల ప్రపంచం ఎదుర్కొంటున్న పలు అంశాలపై రాహుల్​ చర్చించారు. దేశంలో వర్గాలను సృష్టించి, బలహీనపరిచేందుకు ప్రయత్నించిన వారంతా ఇప్పుడు తమను తాము నేషనలిస్టులుగా చెప్పుకుంటున్నారని రాహుల్​ ఆరోపించారు. ప్రస్తుతం దేశంలో నియంతృత్వ పాలన కారణంగా ఒకరకమైన భయం కనిపిస్తోందని, ఇది విధ్వంసానికి దారి తీసే అవకాశం ఉందని చెప్పారు. ప్రతిపక్షాల వాయస్​ను వినేందుకు ప్రధాని మోడీకి ఓపిక లేదని ఆరోపించారు.

‘‘మన ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటుంది. ప్రపంచంలోనే అతి పెద్ద, కఠినమైన లాక్​డౌన్​ను ప్రకటించింది. దాని పరిణామాలు ఎలా ఉన్నాయో అందరూ చూస్తున్నారు. లక్షలాది మంది వలస కూలీలు వేల కిలోమీటర్లు నడుచుకుంటూ సొంతూర్లకు చేరుకున్నారు”అని చెప్పారు. అమెరికాలో ఆఫ్రికన్​ అమెరికన్లు, మెక్సికన్లు, ఇతర జనాన్ని వేరు చేసి చూస్తున్నారని, మన దేశంలో కూడా హిందువులు, ముస్లింలు, సిక్కులను వేరు చేసి చూస్తున్నారని, ఇది దేశాన్ని బలహీనపరుస్తోందని, ఎవరైతే ఇలా దేశాన్ని బలహీనపరుస్తున్నారో వారే తమను తాము నేషనలిస్టులుగా చెప్పుకుంటున్నారని విమర్శించారు. కరోనా తర్వాత పరిస్థితులను అధిగమిస్తామనే నమ్మకం ఉందని, ఎందుకంటే మన దేశ డీఎన్‌ఏను తాను అర్థం చేసుకోగలనని, అందులో ఎలాంటి మార్పూ లేదని అన్నారు.

కరోనా కారణంగా పరిస్థితులు దారుణంగా మారాయని, కానీ విపత్తుల తర్వాత కొత్త ఐడియాలు పుట్టుకొస్తాయని, గతంలో కంటే ఇప్పుడు ప్రజలు ఎక్కువగా ఒకరితో మరొకరు సహకరించుకోవడం కనిపిస్తోందని, కలిసి ఉండటంలో ఉన్న అడ్వాంటేజెస్‌ను వారు గుర్తిస్తున్నారని రాహుల్ చెప్పారు.