మహిళల కోసం సేఫ్టీ వింగ్

మహిళల కోసం సేఫ్టీ వింగ్

రాష్ట్రంలో మహిళలకు మరింత భద్రత కల్పించే లక్ష్యంతో ‘విమెన్​ సేఫ్టీ వింగ్ ’ ఏర్పాటైంది. రాష్ట్రవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న దాడులు, భద్రత, నిందితులకు శిక్షలు పడేలా తీసుకోవలసిన చర్యలను పర్యవేక్షించేందుకు దీనిని ఏర్పాటు చేశారు. హైదరాబాద్ లక్టీకాపూల్ లో ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక విభాగాన్ని శుక్రవారం మహిళా దినోత్సవం సందర్భంగా ఎంపీ కవిత ప్రారంభించారు. తర్వాత విమెన్​ సేఫ్టీ వింగ్​ వెబ్ సైట్, బ్రోచర్​ను హోంమంత్రి మహమూద్​ అలీ, డీజీపీ మహేందర్​రెడ్డి ప్రారంభించారు. తర్వాత ఎంపీ కవిత మాట్లాడారు . అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో మహిళా సెక్యూరిటీకి చర్యలు చేపడుతున్నామని చెప్పారు . సీఎం కేసీఆర్ పోలీస్ డిపార్ట్ మెంట్ కు కావలసిన అన్ని వనరులు ఇచ్చారని, దాంతో దేశానికే దిక్సూచిగా మారిందని అన్నారు . ఆపదలో ఉన్న మహిళల రక్షణ కోసం తీసుకువచ్చిన షీటీమ్స్ మంచి ఫలితాలు సాధించాయన్నారు . హైదరాబాద్​లో అమ్మాయిలు అర్ధరాత్రి కూడా భయాందోళన లేకుండా తిరగగలుగుతున్నారని చెప్పారు . అయితే మహిళలపై దాడులు పెరుగుతుండటం దురదృష్టకరమని, అలాంటి వాటిని నివారించేందుకు ప్రతీ మహిళా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

24 గంటలూ అందుబాటులో : మహమూద్ అలీ
విమెన్ సేఫ్టీవింగ్ ప్రతి రోజూ, 24 గంటల పాటు అందుబాటులో ఉంటుందని హోం మంత్రి మహమూద్ అలీ చెప్పారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ బాగా పనిచేస్తోందని, సీఎం కేసీఆర్​ మహిళల భద్రతకు తొలి ప్రాధాన్యం ఇచ్చారని తెలిపారు. షీ టీమ్స్ తో పాటు భరోసా సెంటర్‌ కు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చిందని డీజీపీ మహేందర్ రెడ్డి చెప్పారు. అన్ని జిల్లాల్లో భరోసా సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు . మహిళలపై జరుగుతున్న వేధింపులను పరిశీలిస్తామని, వేగంగా దర్యాప్తు, విచారణ పూర్తి చేసేలా చర్యలు చేపడతామని విమెన్స్ సేఫ్టీ వింగ్ కు నేతృత్వం వహిస్తున్న ఐజీ స్వాతి లక్రా చెప్పారు . మహిళలకు ఎలాంటి పోలీసు, న్యాయపరమైన సహాయం కావాలన్నా విమెన్ సేఫ్టీ వింగ్ కు రావొచ్చని, సూచించారు.