పరవళ్లు తొక్కుతోన్న కృష్ణమ్మ.. నాగార్జున సాగర్ 20 గేట్లు ఎత్తివేత

పరవళ్లు తొక్కుతోన్న కృష్ణమ్మ.. నాగార్జున సాగర్  20 గేట్లు ఎత్తివేత

హాలియా, వెలుగు: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌‌‌‌‌‌‌‌ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది.  దీంతో ప్రాజెక్టు 20 గేట్లను 5 ఫీట్లు ఎత్తి 1,60,740 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్‌‌‌‌‎కు ఎగువ ప్రాంతం  నుంచి 2,02,353 క్యూసెక్కుల వరద వస్తుండగా, ఇందులో 2, 43,853 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కాగా మంగళవారం సాయంత్రం 6  గంటల వరకు సాగర్‌‌‌‌‌‌‌‌ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకుగాను 589 అడుగులు(310.2522)లకు చేరింది. ప్రాజెక్ట్  కుడి కాల్వ ద్వారా 8,452 , ఎడమ కాల్వ ద్వారా 2,210, విద్యుత్​ఉత్పత్తికి 29,151, ఎస్‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌బీసీ ద్వారా 1,200 , వరద కాల్వకు 600 క్యూసెక్కుల చొప్పున నీటిని వదులుతున్నారు. 

ఎస్సారెస్పీ 9 గేట్ల నుంచి ..

బాల్కొండ, వెలుగు: ఎగువ నుంచి వరద ప్రవాహం పెరగడంతో ప్రాజెక్ట్ ఆఫీసర్లు మంగళవారం ఎస్సారెస్పీ 9 గేట్లు ఎత్తి దిగువకు 28వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి 55,013 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ఉదయం5 గేట్లు ఎత్తి 15,620 క్యూసెక్కులు గోదావరిలోకి వదిలారు. ప్రాజెక్ట్ నీటిమట్టం పూర్తిస్థాయికి చేరడంతో వరద కాలువకు 18వేలు , కాకతీయ కాలువకు 6 వేలు, ఎస్కేప్ గేట్ల ద్వారా 2వేల క్యూసెక్కుల చొప్పున వరదనీటిని వదులుతున్నారు. జల విద్యుత్ కేంద్రంలోని నాలుగు టర్బైన్ల ద్వారా లక్ష్యానికి మించి 36 మెగావాట్ల పవర్ జనరేట్ అవుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1091.00 అడుగులు (80.50 టీఎంసీలు) కాగా మంగళవారం సాయంత్రానికి 1090.90 అడుగులు (80.05 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది.