ముషీరాబాద్, వెలుగు: 10 టవర్స్ 42 అంతస్తుల్లో ఇండ్లు కట్టిస్తామని నమ్మించి రూ. కోట్లు దండుకొని ఇల్లు కట్టియ్యకుండా మోసం చేశారని సాహితీ శర్వాణి ఎలైట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వెంచర్ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రెగ్యులేటరీ అథారిటీ చర్యలు చేపట్టి తమకు న్యాయం చేయాలని కోరారు. సాహితీ శర్వాణి ఎలైట్ అమీన్పూర్ ప్రాజెక్ట్ బాధితుల సంఘం అధ్వర్యంలో ఆదివారం ఇందిరా పార్క్ ధర్నా చౌక్‌లో ఆవేదన ధర్నా చేపట్టారు.
ఈ సందర్భంగా బాధితులు భీమేశ్, గణేశ్, మురళీ కృష్ణ, శివాజీ, కిరణ్, శివ తదితరులు మాట్లాడారు. తమకు తీరని అన్యాయం చేసిన సాహితీ శర్వాణి ఎలైట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై చర్యలు తీసుకోకుండా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసే ప్రభుత్వ అధికారులు, రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ నిద్రపోతోందా అని ప్రశ్నించారు. తమ సమస్యను పరిష్కరించి న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. కమిటీని నియమించి ప్లాట్ లేదా డబ్బును వెనక్కి చెల్లించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ధర్నాలో బాధితులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
