మంత్రి కేటీఆర్ జీవో ఇచ్చినా కలెక్టర్ అమలు చేస్తలె: సాయిప్రియ

 మంత్రి కేటీఆర్ జీవో  ఇచ్చినా కలెక్టర్ అమలు చేస్తలె: సాయిప్రియ

హైదరాబాద్, వెలుగు: జీవో 118 కింద తమ స్థలాలను రెగ్యులరైజ్ చేయాలని, మునుగోడు ఉపఎన్నిక సమయంలో మంత్రి కేటీఆర్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని సాయిప్రియ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు కోరారు. దీనిపై మేడ్చల్ జిల్లా కలెక్టర్ అమోయ్​కుమార్ స్పందించడం లేదని, జీవో అమలుకు నోచుకోకపోతుండగా 350  మంది బాధితులు రోడ్డున పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్​క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో అసోసియేషన్ చీఫ్ అడ్వైజర్ నారగోని ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. జీవో 118 అమలుపై కలెక్టర్ ను కలిస్తే పొంతన లేని సమాధానాలు చెబుతున్నారని, ఆయన తీరును చూస్తుంటే ప్రభుత్వం తమను మోసం చేసినట్టు కనిపిస్తుందన్నారు. 

1995 నుంచి 2002 వరకు వాయిదా పద్ధతిలో ప్లాట్లు కొనుగోలు చేశామని,  కొన్నింటికి ఎల్ఆర్ఎస్​ చెల్లించడంతో పాటు గ్రామ పంచాయతీ నిర్మాణ అనుమతులు కూడా ఉన్నాయని తెలిపారు. కొన్ని ప్లాట్లు రిజిస్ట్రేషన్ కూడా అయ్యాయని, 25 ఏళ్లు గడిచిన తర్వాత ప్రభుత్వం తమ భూములను ప్రభుత్వ భూమి అని ఫెన్సింగ్ వేయడం సరికాదని మండిపడ్డారు.  సాయి ప్రియ నగర్ సర్వే నం. 5 నుంచి 9 వరకు మేడిపల్లి మండలం పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లోని సాలార్ జంగ్ కంచ పర్వతాపూర్ కి చెందిందని, ఇవి పూర్తిగా ప్రైవేట్ సర్వే నంబర్లలోని భూములు అన్నారు. 2002 లో కొందరు రాజకీయ నేతలు, అధికారులు కుమ్మకై విలేజ్ మ్యాప్ ను మార్చి 350 ప్లాట్లను సర్వే నంబర్లు10,11 ప్రభుత్వ భూమిలో ఉన్నట్లు చూపించారని ఆరోపించారు. 

దీనిపై పలు మార్లు ఆందోళన చేయగా కేటీఆర్ స్పందించి జీవో 118  తెచ్చారన్నారు.  కొన్ని ప్లాట్లలో ఇంటి నిర్మాణాలు చేశారని, కరెంటు మీటర్లు, ఇంటి నంబర్లు ఉండి ఆస్తి పన్నులు కడుతున్నామని, అయినా రెగ్యులరైజ్ చేయడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు.  మంత్రి కేటీఆర్ స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ సమావేశంలో ప్రెసిడెంట్ మహేందర్ , వైస్ ప్రెసిడెంట్ యాదగిరి, అడ్వకేట్ హరిప్రసాద్, తిరుమల్, దయాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.