
కామారెడ్డి, వెలుగు: తల్లి లేని ఇద్దరు మైనర్ అడబిడ్డలను వదిలించుకోవాలనుకున్న సొంత తండ్రి, సవతి తల్లి కలిసి దారుణానికి ఒడిగట్టారు. డబ్బులు తీసుకుని మధ్యవర్తుల సాయంతో అదివరకే పెళ్లిళ్లయిన వారికిచ్చి పెండ్లి చేశారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలానికి చెందిన ఓ వ్యక్తి మొదటి భార్య కొంతకాలం క్రితం అనారోగ్యంతో చనిపోయింది. ఆమెకు ఇద్దరు కవల పిల్లలు ఉన్నారు. భర్త మరో మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు ఓ కొడుకు, బిడ్డ పుట్టారు. మొదటి భార్య ఆడ పిల్లలు పెరిగి పెద్దవుతున్నారు. నలుగురు పిల్లలను పెంచడం సవతి తల్లికి ఇష్టం లేదు. ఇదే టైమ్లో ఓ మధ్యవర్తి వారిని కలిసి .. అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఓ వ్యక్తి ఉన్నాడని, అతనితో పెళ్లి చేస్తే డబ్బులు ఇస్తాడని ఆశ పెట్టి రూ.80వేలకు బేరం కుదిర్చాడు. కామారెడ్డిలో స్థిరపడిన రాజస్థాన్వ్యాపారి శర్మన్కు 14ఏళ్లు ఉన్న రెండో అమ్మాయిని విక్రయించారు. 2022 సెప్టెంబర్లో హైదరాబాద్ దగ్గర బాలికకు శర్మాన్తో పెళ్లి జరిపించారు. రూ. 80వేలలో 30వేలు మధ్యవర్తి, మిగతా రూ.50వేలు తల్లిదండ్రులకు ఇచ్చారు.
కొన్నాళ్ల తర్వాత మరో ఆడ బిడ్డను హైదరాబాద్ కు చెందిన కృష్ణ కుమార్ అనే వ్యక్తికి రూ.50వేలకు అమ్మి, పెళ్లి చేసి ఇచ్చారు. రెండో బిడ్డను పెళ్లి చేసుకున్న శర్మాన్ మెదక్ జిల్లా మనోహరాబాద్లో కాపురం పెట్టారు. అప్పటికే అతనికి పెళ్లి అయి ఇద్దరు పిల్లలు ఉన్నారు. మరో మహిళతో వివాహేతర సంబంధం కూడా ఉంది. దీంతో అక్కడి నుంచి తప్పించుకొని కామారెడ్డికి వచ్చిన బాలిక బాలల సంరక్షణ అధికారులకు ఫిర్యాదు చేసింది. బాలల సంరక్షణ అధికారి స్రవంతి మాచారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు విచారణ చేసి ఇద్దరు మైనర్ ఆడ బిడ్డలను రక్షించి, బాల సదనానికి తరలించారు. బిడ్డలను విక్రయించిన తండ్రి, సవతి తల్లితో పాటు పెళ్లి చేసుకున్న శర్మాన్, కృష్ణ కుమార్, మధ్య వర్తులు సాల రాంబాటి, రమేశ్, మహేందర్ లను అరెస్టు చేసి, రిమాండ్కు తరలించినట్లు కామారెడ్డి ఎస్పీ శ్రీనివాసరెడ్డితెలిపారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ అనోన్య, డీఎస్పీ సోమనాథం, సీఐ శ్రీనివాస్ రెడ్డి, ఎస్సై సంతోష్ ఉన్నారు.