నల్లమలలోని దట్టమైన అడవిలో వెలసిన లింగమయ్యను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. సంవత్సరానికి ఒకసారి జరిగే సలేశ్వరం జాతర ప్రారంభమైంది. రెండేళ్ల నుంచి కరోనా కారణంగా సలేశ్వరం జాతరకు అనుమతి ఇవ్వలేదు. దీంతో ఈ ఏడాది అధిక సంఖ్యలో భక్తులు యాత్రకు పయనమయ్యారు. అయితే ఈ ఏడాది ఆంక్షల మధ్య సలేశ్వరం జాతరకు అనుమతిచ్చారు. ప్రతి ఏడాది ఐదురోజుల పాటు జాతర జరుగుతోంది. కానీ ఈ సంవత్సరం మూడు రోజులు మాత్రమే జాతరకు అనుమతినిచ్చారు. దీంతో ఈ నెల 15 నుంచి ప్రారంభమైన సలేశ్వరం యాత్ర 17 వరకు జరగనుంది.
నాగర్ కర్నూల్ జిల్లాలో దట్టమైన నల్లమల అడవుల్లో కొలువై ఉన్నాడు లింగమయ్య స్వామి. సలేశ్వరం లింగమయ్యను దర్శించుకునేందుకు తెలంగాణ, ఏపీ నుంచే కాకుండా కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా భక్తులు వస్తుంటారు. గుట్టలు, పుట్టలు దాటూకుంటూ లింగమయ్యను దర్శించుకోవాల్సి ఉంటుంది. ఈ యాత్రను సాహస యాత్ర కిందే చెప్పుకోవచ్చు. జనావాసానికి 25 కి.మీ దూరంలో దట్టమైన అడవిలో లింగమయ్య ఆలయం ఉంటుంది. ఉగాది వెళ్లిన మొదటి పౌర్ణమిరోజు జాతర ప్రారంభమవుతోంది. దీంతో నిన్నటి నుంచి యాత్ర ప్రారంభమైంది. రెండేళ్ల తర్వాత యాత్రకు అనుమతివ్వడంతో భక్తులు పోటెత్తారు. భక్తుల కోసం మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేశారు. గతంలో 24 గంటలు యాత్రకు అనుమతిచ్చేవారు.. ఈ ఏడాది మాత్రం ఉదయం 7నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే జాతరకు అనుమతిస్తున్నారు. సాయంత్రం 6 తర్వాత అడవిలోకి వెళ్లడానికి వీల్లేదంటూ ఆంక్షలు విధించారు.
