నల్లమలలో సలేశ్వరం జాతర.. భారీ సంఖ్యలో తరలివస్తున్న భక్తులు

నల్లమలలో సలేశ్వరం జాతర.. భారీ సంఖ్యలో తరలివస్తున్న భక్తులు

లింగాల/ వెలుగు ఫొటోగ్రాఫర్: తెలంగాణ అమర్నాథ్ యాత్రగా పిలిచే నల్లమల అడవిలో సలేశ్వరం జాతర బుధవారం ప్రారంభమైంది. మూడు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులకు ఆఫీసర్లు అనుమతిచ్చారు. తెలంగాణతో పాటు ఏపీ, కర్ణాటక నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో జాతరకు వెళ్లే మార్గం కిటకిటలాడింది. 

నాగర్‌‌‌‌‌‌‌‌కర్నూల్‌‌‌‌‌‌‌‌ జిల్లా లింగాల మండలం అప్పాయపల్లి గోర్జగుండాల మీదుగా కొందరు, అమ్రాబాద్‌‌‌‌‌‌‌‌ మండలం మన్ననూరు ఫర్హాబాద్‌‌‌‌‌‌‌‌ చౌరస్తా నుంచి రాంపూర్ పెంట మీదుగా మరికొందరు సలేశ్వరం చేరుకున్నారు. మొదటిరోజే రెండు లక్షల భక్తులు దర్శించుకున్నట్లు తెలుస్తోంది. 

భక్తుల రద్దీ కారణంగా శ్రీశైలం ప్రధాన రహదారిపై మన్ననూరు చెక్‌‌‌‌‌‌‌‌పోస్ట్‌‌‌‌‌‌‌‌ నుంచి ఫర్హాబాద్‌‌‌‌‌‌‌‌ చెక్‌‌‌‌‌‌‌‌పోస్ట్‌‌‌‌‌‌‌‌ వరకు రోడ్లకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. సలేశ్వరం వెళ్లే భక్తుల కోసం నాగర్‌‌‌‌‌‌‌‌కర్నూల్‌‌‌‌‌‌‌‌, అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్‌‌‌‌‌‌‌‌ నుంచి ప్రత్యేకంగా బస్సులు నడిపారు. 

ఐటీడీఏ, రెవెన్యూ, ఆర్‌‌‌‌‌‌‌‌డబ్ల్యూఎస్‌‌‌‌‌‌‌‌, పోలీస్‌‌‌‌‌‌‌‌ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. వన్యమృగాల సంచారం ఉండడంతో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. వివిధ స్వచ్ఛంద సేవా సంస్థల ఆధ్వర్యంలో అన్నదానం, తాగునీరు, మజ్జిగ పంపిణీ చేశారు.