ప్రస్తుతం భారత దేశవాళీ క్రికెట్ లో టీ20 టోర్నీ ముస్తాక్ అలీ ట్రోఫీ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ వేలానికి మరో నాలుగు రోజులు సమయం ఉన్న నేపథ్యంలో యువ క్రికెటర్లు సత్తా నిరూపించుకోవడానికి ఇదొక చక్కని అవకాశం. ఈ మెగా లీగ్ మినీ ఆక్షన్ మంగళవారం (డిసెంబర్ 16) అబుదాబిలోని ఎతిహాద్ అరీనాలో జరగనుంది. ఈ వేలానికి ముందు పంజాబ్ వికెట్ కీపర్ సలీల్ అరోరా విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. శుక్రవారం (డిసెంబర్ 12) పూణేలోని డివై పాటిల్ అకాడమీలో జార్ఖండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 39 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకున్నాడు.
సెంచరీ తర్వాత ఈ యువ క్రికెటర్ విధ్వంసం ఆగలేదు. ఆ తర్వాత తాను ఎదుర్కొన్న 6 బంతుల్లో 25 పరుగులు చేశాడు. ఓవరాల్ గా 45 బంతుల్లోనే 125 పరుగులు చేసి ఐపీఎల్ వేలానికి ముందు అందరి దృష్టి తనవైపుకు తిప్పుకున్నాడు. అరోరా ఇన్నింగ్స్ లో 9 ఫోర్లతో పాటు ఏకంగా 11 సిక్సర్లు ఉన్నాయి. పంజాబ్ 62 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్నప్పడు అరోరా బ్యాటింగ్ కు వచ్చాడు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. 200 కష్టమనుకుంటే జట్టుకు 235 పరుగుల భారీ స్కోర్ అందించాడు. అరోరా వికెట్ కీపర్ కావడంతో ఈ 23 ఏళ్ళ కుర్రాడికి ఐపీఎల్ 2026 వేలంలో కోట్లు కొల్లగొట్టడం ఖాయమనే వార్తలు వినిపిస్తున్నాయి.
సలీల్ అరోరా సెంచరీ చేసినా తన జట్టు ఓడిపోయింది. హై స్కోరింగ్ థ్రిల్లర్ లో పంజాబ్ పై జార్ఖండ్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. సలీల్ అరోరా 45 బంతుల్లోనే 125 పరుగులు చేసి తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. లక్ష్య ఛేదనలో జార్ఖండ్ 18.1 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 237 పరుగులు చేసి గెలిచింది. కుమార్ కుషాగ్ర 42 బంతుల్లోనే 86 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. ఓపెనర్ ఇషాన్ కిషాన్ 23 బంతుల్లో 47 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
Absolute carnage! 💥
— Punjab Kings (@PunjabKingsIPL) December 12, 2025
Salil Arora, take a bow! 🙌#SMAT pic.twitter.com/Iuua83U2YQ

