
- డిసెంబర్7 తో ముగియనున్న పీపీఏ గడువు
- కార్మికులను డ్యూటీలకు రావొద్దని నోటీసులు
- ప్లాంట్ మూసేస్తే 300 కుటుంబాలు రోడ్డుపాలు
- భూములమ్ముకొనే యోచనలో మేనేజ్మెంట్
మంచిర్యాల, వెలుగు :మంచిర్యాలలోని శాలివాహన గ్రీన్ ఎనర్జీ, బయోమాస్ పవర్ ప్లాంట్ మూసివేతకు రంగం సిద్ధమైంది. ఈ ఏడాది డిసెంబర్ 7వ తేదీతో 20 ఏండ్ల పవర్ పర్చేజ్అగ్రిమెంట్ (పీపీఏ) పూర్తికానుంది. దీంతో ప్లాంట్‌ను మూసేందుకు మేనేజ్మెంట్ ప్లాన్చేస్తోంది. ఇందులో భాగంగా మూడు నెలలుగా ఊక కొరత ఉందని కరెంట్ఉత్పత్తి నిలిపివేసింది. ప్రభుత్వం దగ్గర రూ.8 కోట్లకు పైగా బిల్స్ పెండింగ్ ఉన్నాయని, ఉద్యోగులకు, వర్కర్లకు రెండు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు. డిసెంబర్ వరకు సగం జీతాలు ఇస్తామని, డ్యూటీలకు రావాల్సిన అవసరం లేదని నోటీసులు జారీ చేసింది. డిసెంబర్తర్వాత ప్లాంట్‌ను క్లోజ్చేస్తే తమ కుటుంబాలు రోడ్డున పడుతాయని ఉద్యోగులు, కార్మికులు ఆందోళన చెందుతున్నారు.
2002లో ప్రారంభం....
మంచిర్యాలలోని రంగంపేటలో 6 మెగావాట్ల సామర్థ్యంతో 2002లో శాలివాహన గ్రీన్ఎనర్జీ ప్లాంట్‌ను ప్రారంభించారు. ఒక మెగావాట్‌కు రూ.4 కోట్లు చొప్పున మొత్తం రూ.24 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేశారు. రైస్‌మిల్లుల నుంచి వెలువడే ఊక, సింగరేణి బొగ్గు, కర్రపొట్టు, ఆయిల్‌పామ్ పొట్టుతో కరెంట్ఉత్పత్తి చేసి ప్రభుత్వానికి సప్లై చేసేవారు. కొన్నేండ్లుగా ఊక, పొట్టు కొరతతో పాటు ముడి ఇంధనాల రేట్లు పెరగడంతో పలుమార్లు కరెంట్ ఉత్పత్తిని నిలిపివేసిన సందర్భాలున్నాయి. మూడు నెలలుగా రైస్‌మిల్లులు నడవకపోవడంతో ముడి ఇంధనాల్లో ప్రధానమైన ఊక కొరత ఏర్పడింది. రోజుకు 200 టన్నుల ముడి ఇంధనం అవసరం కాగా, 70 శాతం ఊకను వాడుతున్నారు. ఊక లేకపోవడంతో మూడు నెలలుగా ఉత్పత్తి నిలిచిపోయింది. అలాగే ప్రభుత్వం నుంచి నెలనెలా బిల్లులు రాకపోవడంతో ఉద్యోగులు, కార్మికులకు సక్రమంగా జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది.
రోడ్డున పడనున్న వర్కర్లు
ప్లాంట్‌పై ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 300 కుటుంబాలు ఆధారపడి బతుకుతున్నాయి. ఇందులో రెగ్యులర్ఉద్యోగులు, వర్కర్లు సుమారు 100 మంది ఉన్నారు. ట్రాక్టర్లు, లారీలు, ఇతర పనులు చేసేవారు మరో 200 మంది ఉన్నారు. వీరంతా 20 ఏండ్లుగా చాలీచాలని జీతాలతో నెట్టుకొస్తున్నారు. రెగ్యులర్‌గా జీతాలు ఇవ్వకున్నా ప్లాంట్‌నే నమ్ముకుని బతుకుతున్నారు. డిసెంబర్తర్వాత పవర్ ప్లాంట్‌ను క్లోజ్చేస్తే తామంతా రోడ్డున పడుతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది రిటైర్మెంట్కు దగ్గరలో ఉండడంతో ఈ వయసులో ఎట్లా బతకాలని వాపోతున్నారు. మూసివేత, ఉద్యోగులు, వర్కర్లకు సెటిల్మెంట్..లేబర్ యాక్టుల ప్రకారం జరగాల్సి ఉన్నా యాజమాన్యం పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు.
రియల్ వెంచర్‌గా మారనుందా?
పవర్‌ప్లాంట్‌కు దాదాపు 40 ఎకరాల భూములుండగా, యాజమాన్యం ఇప్పటికే 10 ఎకరాలను అమ్ముకున్నట్టు సమాచారం. మిగిలిన 30 ఎకరాల్లో 11 ఎకరాల్లో ప్లాంట్ ఉంది. ఈ భూములు మంచిర్యాల పట్టణాన్ని ఆనుకుని ఉండడంతో డిమాండ్ ఏర్పడింది. ఇక్కడ ఎకరం రూ.2 కోట్లకు పైగా పలుకుతోంది. ఒడిదుడుకుల మధ్య ప్లాంట్‌ను నడపడం కంటే భూముల అమ్మకం ద్వారా ఏకకాలంలో భారీగా లబ్ధి పొందవచ్చనే ఆలోచనలో మేనేజ్మెంట్ఉన్నట్టు సమాచారం. అయితే గతంలో ప్లాంట్‌కు అగ్గువకు భూములు ఇచ్చిన రైతులు తమ భూములను తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
ఎమ్మెల్యేను కలిసిన వర్కర్లు
ప్లాంట్ మూసివేత దాదాపు ఖాయమైన నేపథ్యంలో ఉద్యోగులు, వర్కర్లు శాలివాహన పరిరక్షణ సమితిగా ఏర్పడి ప్లాంట్‌ను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మంగళవారం మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావును కలిసి పవర్ పర్చేస్ అగ్రిమెంట్(పీపీఏ)ను మరో పదేండ్లు పొడిగించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
పీపీఏ కోసం ప్రయత్నిస్తున్నాం
డిసెంబర్7 నాటికి పీపీఏ గడువు ముగియనుంది. తిరిగి పీపీఏ కుదుర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. కానీ ప్రభుత్వం సుముఖంగా లేదు. దేవాపూర్, బసంత్‌నగర్‌లోని సిమెంట్కంపెనీలను సంప్రదించినా ఫలితం లేదు. ప్రభుత్వం పొడిగిస్తే ప్లాంట్‌ను నడిపిస్తాం.
– శంకరయ్య, ప్లాంట్ జనరల్ మేనేజర్