చరిత్ర సృష్టించిన బామ్మ.. 66 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం

చరిత్ర సృష్టించిన బామ్మ.. 66 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం

మన ఇళ్లలోనూ పెద్దోళ్ళు ఉన్నారు. 50  నుంచి 55 ఏళ్ల వయసుకే మోకాళ్ల నొప్పులంటూ ఇళ్లలో నానా రభస చేస్తుంటారు. కాలు తీసి కాలు పెట్టమంటే.. ఏదో అయిపోయినట్లు గోల చేస్తుంటారు. పైగా జండూబామ్ డబ్బాలతో, మందుగోలీలతో పోటీపడుతుంటారు. కానీ, ఈ బామ్మ రూటే వేరు. మైదానంలోకి దిగి బ్యాట్.. బాల్‌తో కుస్తీ పడుతోంది. అందునా, 66 ఏళ్ల వయసులో.. వికెట్ల వెనుక. ఆమె సాహసాన్ని మెచ్చుకోవాల్సిందే.

లండన్‌ కు చెందిన 66 ఏళ్ల 'సాలీ బార్టన్' అనే వృద్ధ మహిళ ముగ్గురు మనవళ్లు పుట్టిన తరువాత అంతర్జాతీయ క్రికెట్‌లో ఎంట్రీ ఇచ్చింది. తద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన అత్యంత వృద్ధ మహిళగా చరిత్ర సృష్టించింది. మే నెల‌లో బార్టన్ గిబ్రాల్టర్ జ‌ట్టు త‌ర‌ఫున‌ బార్టన్ ఎస్టోనియాతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఆడింది. అప్పుడు ఆమె వ‌య‌సు 66 ఏళ్ల 334 రోజులు. తద్వారా ఆమె పోర్చుగ‌ల్‌కు చెందిన అక్బర్ స‌య్యద్ పేరిట ఉన్న రికార్డును బ‌ద్ధ‌లు కొట్టింది. అక్బర్ 66 ఏళ్ల 12 రోజుల వ‌య‌సులో 2012లో పోర్చుగ‌ల్‌ తరుపున అంతర్జాతీయ అరంగేట్రం చేశారు.

గణిత లెక్చరర్‌ 

వికెట్ కీప‌ర్/ బ్యాటర్ అయిన బార్టన్‌కు ఎస్తోనియాతో సిరీస్‌లో బ్యాటింగ్ చేసే అవ‌కాశం రాలేదు. అంతేకాదు, వికెట్ల వెనుక ఏ ఒక్క‌రిని ఔట్ చేయ‌లేక‌పోయింది. అలా అని క్యాచ్ పట్టలేదేమో అనుకోకండి. చాలా షార్ప్ ఆట. అయితేనేం.. తన సహచరులు రాణించడంతో జిబ్రాల్టర్ జ‌ట్టు 3-0తో సిరీస్ కైవ‌సం చేసుకుంది. ఇక బార్టన్ వ్యక్తిగ‌త జీవితానికి వ‌స్తే.. ఆమె మాజీ ప్రొఫెస‌ర్. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో గణితంలో లెక్చరర్‌గా పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు.