సల్మాన్ ఖాన్ సోదరులపై కేసు నమోదు

సల్మాన్ ఖాన్ సోదరులపై కేసు నమోదు
కరోనా రూల్స్ ఉల్లంఘించినందుకు ప్రముఖ బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కుటుంబసభ్యులను ముంబై అధికారులు క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. బాలీవుడ్ నటుడు నిర్మాత సొహైల్ ఖాన్, ఆయన కుమారుడు నిర్వాణ్ ఖాన్, మరో సోదరుడు అర్బాజ్ ఖాన్ పై పోలీసు కేసు కూడా నమోదు చేశారు. బ్రిటన్ లో కొత్త కరోనా రకం వ్యాప్తి తీవ్రమవుతున్న క్రమంలో మహారాష్ట్ర ప్రభుత్వం కరోనా నియమాలను కఠినంగా అమలు చేస్తోంది. వీటిలో భాగంగా బ్రిటన్, యూఏఈ, యూరోపియన్ దేశాలనుంచి తిరిగి వచ్చిన వారు.. ఏడురోజుల పాటు తప్పనిసరిగా ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్లో ఉండాలి.  అయితే..ప్రభుత్వం ఆమోదించిన హోటళ్లలో కూడా ఈ సమయాన్ని గడిపేందుకు గ్రీన్ సిగ్నలిచ్చారు. ఈ నియమాలను ఉల్లంఘించారని సల్మాన్ కుటుంబ సభ్యులపై బీఎంసీ వైద్యాధికారి ఒకరు ఫిర్యాదు చేశారు. దుబాయి నుంచి డిసెంబర్ 25న తిరిగి వచ్చిన వీరు .. హోటల్లో క్వారంటైన్ సమయాన్ని గడిపేందుకు బదులుగా తమ ఇంటికే వెళ్లిపోయారని ఫిర్యాదులో తెలిపారు. దీంతో అంటువ్యాధుల చట్టం సెక్షన్ 188 కింద నగరంలోని ఖార్ పోలీస్ స్టేషన్లో సొహైల్, ఆర్బాజ్, నిర్వాణ్ లపై సోమవారం ఎఫ్ఐఆర్ ను నమోదు చేశారు. తర్వాత వారిని క్వారంటైన్లో ఉంచేందుకు నగరంలోని తాజ్ ల్యాండ్స్ ఎండ్ హోటల్ కు తరలించారు.