
హైదరాబాద్, వెలుగు:
స్కూల్‌కు రాని పిల్లల్ని లెక్కించేందుకు ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ ప్లాన్ చేస్తోంది. డిసెంబర్ నెలాఖరు వరకు ఈ పని పూర్తయ్యేలా సమగ్ర శిక్షా అభియాన్(ఎస్ఎస్ఏ) షెడ్యూల్ రెడీ చేసింది. గతంలో చేసిన సర్వేలపై విమర్శల నేపథ్యంలో ఈ సారి జాగ్రత్తలు తీసుకుంటోంది. 2019–20 విద్యాసంవత్సరానికి డిసెంబర్నెలాఖరు నుంచి అధికారికంగా యూడైస్ లెక్కలు ప్రారంభమయ్యే అవకాశముంది. ఇప్పటికే స్కూల్స్‌లో చేరిన స్టూడెంట్స్ వివరాలను స్కూల్ఎడ్యుకేషన్ అధికారులు సేకరించారు. వాటి ఆధారంగా ఔటాఫ్ స్కూల్ చిల్ర్డన్స్వివరాలను సేకరించాలని నిర్ణయించారు. దీంట్లోనే ప్రభుత్వ, ఎయిడెడ్స్కూళ్లతోపాటు భవిత కేంద్రాల్లో చేరిన తర్వాత డ్రాపైన పిల్లల వివరాలను తీసుకుంటారు. ముఖ్యంగా 14 ఏండ్లలోపు పిల్లల లెక్క తీస్తారు. దీనికోసం సీఆర్పీలు, డీఎల్‌ఎంటీల సాయం తీసుకోనున్నారు. గతంలో సర్వే సరిగా చేయలేదని విమర్శలొచ్చాయి. ప్రస్తుతం స్టేట్‌లో 16 వేల మంది మాత్రమే బడీడు పిల్లలు బడిబయట ఉన్నట్టు లెక్కలు చెప్తున్నారు. కానీ వాస్తవ లెక్కలు దీనికి నాలుగింతలుంటాయని విద్యావేత్తలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు చెప్తున్నారు. డిసెంబర్3 నుంచి 12 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఈ సర్వే కొనసాగనుంది. డిసెంబర్ 28తో ఈ ప్రక్రియ అంతా ముగియనుంది.
సీఆర్పీలదే కీలక పాత్ర
ఔటాఫ్ స్కూల్ చిల్ర్డెన్స్ సర్వేలో క్లస్టర్ రీసోర్స్ పర్సన్స్ (సీఆర్పీ) కీలకంగా మారారు. సీఆర్పీలు డీఎల్ఎల్టీల సహాయంతో తన పరిధిలోని గ్రామాలను, ఆవాస ప్రాంతాలను పరిశీలించి, డ్రాపౌట్స్ వివరాలను సేకరిస్తారు. ప్రత్యేక అవసరాలున్న పిల్లల డ్రాపౌట్స్‌ను ఐఈఆర్పీలు సేకరిస్తారు. ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్‌తోపాటు పలు జిల్లాల్లో వలస కార్మికులు ఎక్కువగా ఉన్నారు. ఇటుక బట్టీలు, పెద్దపెద్ద నిర్మాణాలు జరుగుతున్న ప్రాంతాలకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా కార్మికులు వలస వస్తుంటారు. సంచార జాతాల కుటుంబాల పరిస్థితి కూడా ఇలానే ఉంటుంది. ఆయా కుటుంబాల పిల్లలను గుర్తించి సమీపంలోని సర్కారు బడుల్లో అధికారులు చేర్పించనున్నారు.