స్కూళ్లకు పంపి.. అంతలోనే వెనక్కి రమ్మంటున్రు

స్కూళ్లకు పంపి.. అంతలోనే వెనక్కి రమ్మంటున్రు
  • ఎస్ఎస్ఏలో ఫారిన్ సర్వీస్ టీచర్లకు స్కూళ్ల అలాట్మెంట్ 
  • 3 నెలలకు పొరపాటును గుర్తించి, నివారణ చర్యలు  

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సమగ్ర శిక్ష అభియాన్ (ఎస్ఎస్ఏ)లో ఫారిన్ సర్వీస్​లో పనిచేస్తున్న టీచర్లకు అధికారులు నిర్లక్ష్యంతో స్కూళ్లను అలాట్ చేశారు. దీంతో పలువురు టీచర్లు మళ్లీ స్కూళ్లలో జాయిన్ అయ్యారు. ఇదంతా జరిగిన మూడు నెలల తర్వాత పొరపాటును గుర్తించిన అధికారులు.. వారిని వెనక్కి రప్పించేందుకు చర్యలు మొదలుపెట్టారు. జనవరిలో టీచర్లను జీవో 317 ప్రకారం కొత్త జిల్లాలు, జోన్లు, మల్టీ జోన్లకు అలాట్ చేశారు. అయితే సస్పెన్షన్, ఫారిన్ సర్వీస్​లో ఉన్నవారికి జిల్లాలు, జోన్లు మాత్రమే అలాట్ చేయాల్సి ఉంది. ఆ తర్వాత వారంతా తిరిగి ఫారిన్ సర్వీస్​లోనే కొనసాగాలి. కానీ అధికారుల నిర్లక్ష్యంతో ఎస్ఎస్ఏ పరిధిలో పనిచేస్తున్న కొందరు జిల్లా కోఆర్డినేటర్లు, జీసీడీఓలు ఆప్షన్లు ఇవ్వగా వారికి స్కూళ్లు అలాట్ అయ్యాయి. వీళ్ల ఆప్షన్ ఫారాలను పక్కన పెట్టాల్సిన అధికారులు.. అసలు వారిని గుర్తించనేలేదు. వీరిలో కొందరు తిరిగి ఎస్ఎస్ఏ లోనే మళ్లీ ఫారిన్ సర్వీస్​లో చేరగా, మరికొందరు టీచర్లు స్కూళ్లలో చేరిపోయారు. 

రెండ్రోజుల కింద ‘రిటర్న్’ ఆదేశాలు 

భూపాలపల్లి జిల్లాలో పనిచేసే ఇద్దరు స్కూల్ అసిస్టెంట్లు జనగామ, హనుమకొండ జిల్లాల్లోని స్కూళ్లకు అలాట్ అయ్యారు. వారు మూడు నెలల జీతాలు కూడా అక్కడే తీసుకున్నారు. వీరు స్కూళ్లలో జీతాలు పొందాలంటే లాస్ట్ పే సర్టిఫికెట్ (ఎస్పీసీ) ఉండాలి. దాన్ని కూడా అధికారులు ఇచ్చారు. ఇదంతా ఆలస్యంగా గుర్తించిన ఉన్నతాధికారులు, వెంటనే స్కూళ్లలో విధులు నిర్వహిస్తున్న వారు ఫారిన్ సర్వీస్​లో చేరాలని రెండు రోజుల కింద ఆదేశాలు జారీచేశారు. మూడు నెలల పాటు వేరే చోట జీతాలు తీసుకున్న తర్వాత, మళ్లీ పాత విధుల్లోకి ఎలా వెళ్లాలని టీచర్లు ప్రశ్నిస్తున్నారు. అయితే కనీసం ఫారిస్ సర్వీస్​లో పనిచేసే వారినీ అధికారులు గుర్తించకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనమని టీచర్ల సంఘాలు మండిపడుతున్నాయి. మరోపక్క ఫారిన్ సర్వీస్​లో ఉన్న వారు ఆప్షన్లు ఇచ్చుకోవడం, వారికి స్కూల్స్ అలాట్ చేయడం ద్వారా సీనియార్టీలో గందరగోళం ఏర్పడిందని, ఇప్పుడు వీటిని ఎలా పరిష్కరిస్తారని ప్రశ్నిస్తున్నారు.