
హీరోయిన్ సమంత నిర్మాతగా తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ ‘శుభం’(Subham).ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పేరుతో ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించిన ఆమె.. ఫస్ట్ మూవీగా ఈ సినిమాను నిర్మించింది. ‘చచ్చినా చూడాల్సిందే’అనేది క్యాప్షన్. ‘సినిమా బండి’ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల దీనికి దర్శకుడు. వసంత్ మరిగంటి కథను అందించాడు.
నేడు శుక్రవారం(2025 మే9న) శుభం మూవీ థియేటర్లలో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆడవాళ్ల సీరియల్ పిచ్చి నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ ఎలా ఉంది? టీజర్, ట్రైలర్ విజువల్స్లో చూపించిన మజా సినిమాలో ఉందా? సమంత నిర్మాతగా మారి, చెక్కిన ఈ తొలి చిత్రం ఎలాంటి టాక్ సొంతం చేసుకుంది? కొత్త వాళ్ల నటన ఎలాంటి వినోదాన్ని పంచింది? అనే వివరాలు రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటంటే:
వైజాగ్ లోని భీముని పట్నం అనే పల్లెటూరు. అప్పుడప్పుడే పల్లెటూళ్లకి DTHలు పరిచయం అవుతున్న రోజులవి. ఆ భీముని పట్నం ఊళ్ళో శ్రీనివాస్ (హర్షిత్ రెడ్డి) అనే యువకుడు ఉంటాడు. అతనో కేబుల్ ఆపరేటర్. తన ఇద్దరు స్నేహితులు (గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పెరీ) లతో హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తుంటాడు.
ఈ క్రమంలో శ్రీనివాస్కు శ్రీవల్లి (శ్రియ కొణతం)తోపెళ్లవుతుంది. ఫస్ట్ నైట్ మీద ఎన్నో ఆశలతో ఉన్న శ్రీనివాస్కి, మొదటిరోజే శ్రీవల్లి షాక్ ఇస్తుంది. పడక గదిలో, అది ఫస్ట్ నైట్ రోజు శ్రీవల్లి టీవీలో సీరియల్ చూస్తూ, దయ్యం పట్టినట్టు వింతగా ప్రవర్తిస్తుంది. అది గమనించిన శ్రీనివాస్ షాక్ అవుతాడు.
ఆ వెంటనే అతని ఇద్దరి స్నేహితులకు కాల్ చేసిన, వాళ్ళ భార్యలు కూడా అదే టీవీ సీరియల్ చూస్తూ పిచ్చిగా ప్రవర్తిస్తుంటారు. వీళ్లే కాదు ఆ ఊర్లో ఉన్న వారందరూ రాత్రి 9 గంటలు అవ్వగానే అలానే ప్రవర్తిస్తుంటారు. సీరియల్ చూడటాన్ని అడ్డుకుంటే, భర్తలపైనా తెగబడి మరీ దాడులు చేస్తారు. సీరియల్ పూర్తయ్యాక మళ్లీ ఏమీ జరగలేదన్నట్టే వ్యవహరిస్తుంటారు.
మరి వారికి సరిగ్గా ఆ సీరియల్ టైంలోనే ఎందుకు దయ్యం పడుతుంది? అలాంటి భార్యల పిచ్చి వల్ల శ్రీను, అతడి స్నేహితుల జీవితంలో ఎలాంటి మలుపు చోటుచేసుకుంది? చివరికి ఊళ్ళో ఆడవాళ్లకు పట్టిన దయ్యాన్ని ఎలా మట్టుబెట్టారు? ఈ సమస్యకి మాయ (సమంత) ఎలాంటి పరిష్కారం చూపింది. ఇంతకూ ఆ సీరియల్ ఏంటీ? ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్నఆ సీరియల్కు శుభం కార్డ్ పడిందా? వాళ్ల కాపురాలు చక్కబడ్డాయా? లేదా అనేది మిగతా స్టోరీ.
ఎలా ఉందంటే:
ఇదొక హారర్-కామెడీ జోనర్. అయితే, సీరియల్ పిచ్చిపై ఇంత నవ్వుకునేలా సినిమా రాలేదనే చెప్పాలి. ఎందుకంటే, ఇప్పటికీ ఎన్నో మూవీస్ లో ఏదో ఒక చోట సీరియల్ చూసే ఆడవాళ్లను చూపించారు. కానీ, ఇందులో కథా వస్తువే ఓ సీరియల్. ఆ సీరియల్ చుట్టూ ఊరి ఆడవాళ్ల పిచ్చి. సినిమా స్టార్ట్ అవుతూనే ఒక చక్కటి పాటతో కథను అర్ధమయ్యేలా చెప్పుకొచ్చాడు దర్శకుడు ప్రవీణ్. పాలు నీళ్ల బంధం.. ఇది జన్మజన్మల బంధం అనే పాటతోనే శుభం కథాగమనం ఏంటో చూపించాడు.
ముఖ్యంగా ఈ కథలో ఆడవాళ్ల పరిస్థితులపై చర్చించిన విధానం ఆలోచింపజేస్తుంది. ముస్లిం యువతి షాలిని కొండపూడి పాత్ర ఆడాళ్ల అణచివేతకు అద్దం పట్టే పాత్రలో నటించింది. బయటకు వెళ్లాలి.. బ్యూటీపార్లర్ పెట్టాలనే కోరిక ఉన్నా.. తనలోనే అణుచుకునే పాత్ర ఆలోచింపజేస్తుంది.
మరో మహిళ కొత్తగా పెళ్లై ఓ మధ్యతరగతి ఇంట్లోకి కోడలిగా వెళ్ళినప్పుడు అక్కడ తన భర్తతో, అత్తమామలతో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది? అనేది ఉన్నతంగా ఉంది. మూడో మహిళ గృహిణి అయ్యాక పురుషాధిక్యత వల్ల ఎలాంటి దారుణ పరిస్థితులను ఎదుర్కొంది? అనే అంశం లోతుగా చర్చించిన విధానం బాగుంది.
ఫస్టాఫ్ విషయానికి వస్తే.. రాత్రి పూట సీరియల్ చూసే ముగ్గురి ఫ్రెండ్స్ భార్యలు.. వారి వింత ప్రవర్తనతో విసుగుపోయే భర్తలు, దానితోడు ఆ ఊర్లోని మహిళలంతా అదే విధంగా ప్రవర్తించడం ఆసక్తిగా ఉంది. సీరియల్ చూసి చూసి ఆఖరికి దెయ్యాలుగా మారిపోవడం, వారి నుంచి తప్పించుకునేందుకు ఊర్లో పురుషులంతా అష్టకష్టాలు పడడటం చక్కగా కుదిరింది. సీరియల్ చూసే ఆడవాళ్ల ప్రవర్తనకు గల కారణాన్ని రివీల్ చేసే సీన్ తో కథపై మరింత ఆసక్తి పెరుగుతుంది. ఇదే క్రమంలో వచ్చే ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండాఫ్ పై మరింత క్యూరియాసిటీ కలిగేలా చేస్తోంది.
సెకండాఫ్ విషయానికి వస్తే.. ఆ సీరియల్స్ తో ఇంట్లో భర్తలు రోజు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు, ఎలా పరిష్కరించుకున్నారు? అనేది చూపించారు. ఇందులో అందరూ కొత్తవాళ్లు నటించడం సినిమాకు ఫ్రెష్ ఫీలింగ్ వచ్చేలా చేశాడు డైరెక్టర్. వారి చలాకీ పెర్ఫార్మెన్స్‌తో రెండు గంటలపాటు సీట్లలో అత్తుకుపోయేలా చేశారు. నవ్వించడమే కాకుండా కొన్ని సీన్లలో ఎమోషన్ అయ్యేలా చేశారు.
ప్రతి ఊరిలో, ప్రతి ఇంట్లో, మన చుట్టూ ఉండే పరిసరాల్లో ఉన్న వ్యక్తులను గుర్తు చేసేలా చేయడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. అయితే, ఈ మూవీ హార్రర్ కామెడీ నేపథ్యంలో వచ్చింది. కానీ, మరి అంతలా భయపెట్టే సీన్స్ ఉండవు. అయినా, ప్రేక్షకులకు ఎక్కడా బోర్ కొట్టదు. ఎందుకంటే, శుభం ‘చచ్చినా చూడాల్సిందే’ అనేది క్యాప్షన్. ఇక్కడే మేకర్స్ సగం విజయం సాధించారు. కనుకే ప్రేక్షకులు చివరి వరకు సీట్ లో అతుక్కుపోయేలా థ్రిల్ చేశాడు డైరెక్టర్ ప్రవీణ్.
ఎవరెలా చేశారంటే:
సమంత స్పెషల్ అప్పియరెన్స్ బాగుంది. సినిమాకు ప్లస్ అయ్యింది. కొత్తవాళ్ళు అందరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. మరో ఇంపార్టెంట్ రోల్ లో వంశీధర్ అద్భుతంగా నటించాడు. మిగతా నటీనటులు మెప్పించారు.
సాంకేతిక అంశాలు:
నిర్మాతగా సమంత మంచి కథను ఎంచుకుంది. కథకు తగిన నిర్మాణం చేపట్టి విజయం సాధించింది. మృదుల్ సుజిత్ సేన్ సినిమాటోగ్రఫ్రీ మెప్పిస్తుంది. హార్రర్ విజువల్స్ ను బాగా చూపించాడు. ఇంట్లో ఉండే సహజ వాతావరణాన్ని క్రియేట్ చేశాడు.
మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. మరో మ్యూజిక్ డైరెక్టర్ క్లింటన్ సిరీజో కథకు తగిన పాటలతో ఆకట్టుకున్నాడు. వసంత్ మరింగంటి కథ మెప్పించింది. చివరగా డైరెక్టర్ ప్రవీణ్ ప్రేక్షకులను భయపెట్టి, నవ్వించి, ఎమోషనల్ అయ్యేలా చేసి సక్సెస్ అయ్యాడు.