
కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ పాత్రల కంటే.. ఫిమేల్ సెంట్రిక్ సబ్జెక్ట్స్ చేయడానికే ఇష్టపడుతోంది సమంత. అందుకే ‘శాకుంతలమ్’ సినిమాకి పని చేయడాన్ని చాలా ఎంజాయ్ చేశానంటోంది. గుణశేఖర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో శకుంతలగా నటించిందామె. రీసెంట్‌గా ఆమె పోర్షన్ షూటింగ్ పూర్తవడంతో ఇన్‌స్టాలో ఎమోషనల్ అయ్యింది సామ్. ‘ఈ సినిమా నాకు జీవితాంతం గుర్తుంటుంది. నేను చిన్నప్పట్నుంచీ ఫెయిరీ టేల్స్ని నమ్ముతాను. ఇప్పటికీ అంతే.. పెద్దగా మారలేదు. ఇప్పుడీ ఫెయిరీ టేల్‌ని నాకిచ్చి నా కలను నిజం చేశారు గుణశేఖర్. ఆయన కథ చెప్పినప్పుడే అందమైన మరో ప్రపంచంలోకి వెళ్లిపోయాను. అలాంటి ప్రపంచం మరొకటి లేదనిపించింది. సెల్యూలాయిడ్ మీద ఆ అందమైన ప్రపంచాన్ని సృష్టించడం సాధ్యమేనా అనిపించింది. గుణ సర్ నా అంచనాలకు మించి సృష్టించారు. షూటింగ్ జరిగినన్నాళ్లూ నాలోని చిన్నపిల్ల ఆనందంతో చిందులేసింది. ఇంత మంచి సినిమాని నాకిచ్చిన గుణశేఖర్‌కి రుణపడి ఉంటాను’ అంటూ పొంగిపోయింది సమంత. దుష్యంతుడిగా మలయాళ నటుడు దేవ్ మోహన్, చిన్ననాటి భరతుడిగా అల్లు అర్జున్ కూతురు అర్హ నటిస్తున్న ఈ సినిమాని దిల్ రాజు సమర్పణలో నీలిమ నిర్మిస్తున్నారు.