
- తెలంగాణ ప్రభుత్వానికి నటి సమంత విజ్ఞప్తి
- కేరళ తరహాలో ఇక్కడా కమిటీ వేయాలని డిమాండ్
హైదరాబాద్, వెలుగు : మలయాళ సినీ పరిశ్రమ (మాలీవుడ్)లో మహిళలపై లైంగిక వేధింపుల వ్యవహారానికి సంబంధించి జస్టిస్ హేమ కమిటీ ఇచ్చిన రిపోర్టును హీరోయిన్ సమంత ప్రశంసించారు. తెలంగాణ ప్రభుత్వం కూడా టాలీవుడ్ లో మహిళలపై లైంగిక వేధింపులకు సంబంధించిన సబ్ కమిటీ రిపోర్టును విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆ రిపోర్టు విడుదలైతేనే తెలుగు సినీ పరిశ్రమలో మహిళలకు భద్రత, పని చేసేచోట సురక్షితమైన వాతావరణం సృష్టించేందుకు తగిన పాలసీలు రూపొందించేందుకు వీలవుతుందన్నారు.
సమంత శనివారం ఈ మేరకు ఇన్ స్టాగ్రామ్ లో ఓ పోస్టు పెట్టారు. ‘‘తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోని మహిళలం హేమ కమిటీ రిపోర్టును స్వాగతిస్తున్నాం. నిరంతర ప్రయత్నాలతో ఈ ఉద్యమానికి నాంది పలికిన కేరళలోని డబ్ల్యూసీసీ (విమెన్ ఇన్ సినిమా కలెక్టివ్) సంస్థను అభినందిస్తున్నాం. ఇదే బాటలో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ‘ది వాయిస్ ఆఫ్ విమెన్’ పేరుతో సంస్థను ఏర్పాటు చేయాలి. కేరళ తరహాలో తెలంగాణ ప్రభుత్వం కూడా టాలీవుడ్ లో మహిళలపై లైంగిక వేధింపులపై దర్యాప్తుకు ఒక కమిటీని నియమిస్తే చాలా ప్రయోజనకరంగా ఉంటుంది” అని ఆమె సూచించారు.