ఒకే భూమి… రెండుసార్లు అమ్మిన్రు

ఒకే భూమి… రెండుసార్లు అమ్మిన్రు

రెండో సారి అమ్మిన రైతు కుటుంబం రిమాండ్​

చౌటుప్పల్​, వెలుగు: యాదాద్రి జిల్లా చౌటుప్పల్​మండలం తూఫ్రాన్​పేటలో ఒకే భూమిని రెండుసార్లు అమ్మిన రైతు కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యులను,  సా క్షులను, ప్లాట్లుగా మార్చిన భూమిని వ్యవసాయభూమిగా రిజిస్ట్రేషన్​ చేసినందుకు అప్పటి సబ్​ రిజిస్ట్రార్​ను, డాక్యుమెంట్​ రైటర్​ను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.  వారిని రామన్నపేట కోర్టులో హజరు పర్చగా రిమాండ్​ విధించి నల్లగొండ జైలుకు పంపారు. ఈ కేసులో ఇదివరకే రియల్​ వ్యాపారులను అరెస్టు చేశారు.

ప్లాట్లు కొన్నవారి పోరాటంతో..

హైదరాబాద్​ వ్యక్తులు భూమి చుట్టూ ప్రహరీగోడ నిర్మించడంతో సుబ్బరాజు దగ్గర ప్లాట్లు కొన్న దాదాపు వందమంది  లబోదిబోమన్నారు. వారంతా కలిసి తమకు న్యాయం చేయాలని కోరుతూ  పోలీసులకు, కలెక్టర్​కు, గ్రామపంచాయతీకి మొరపెట్టుకున్నారు. చాలా ప్రయత్నాల తర్వాత గత ఏడాది చివర్లో పోలీసులు  కేసు నమోదు చేశారు. ఇటీవల తుఫ్రాన్​పేటలో వెలుగు చూసిన భూదందాపై దృష్టిపెట్టిన ఎస్వోటీ పోలీసులు సోమవారం రాత్రి రైతు కుటుంబానికి చెందిన ఐదుగురిని అదుపులోకి తీసుకొని విచారించారు. వీరితో పాటు అప్పట్లో చౌటుప్పల్​ సబ్​రిజిస్ట్రార్, డాక్యుమెంట్​ రైటర్​ సత్యనారాయణ, సాక్షులు బండారి, పెద్దిరాజు, రెండో సారి భూమి కొనుగోలు చేసిన ఇద్దరిపై కేసు నమోదు చేశారు. రెండోసారి భూమి కొన్న హైదరాబాద్​ వ్యాపారులు ఈ భూమికి పట్టాదారు పాసుబుక్కుల కోసం స్థానిక లీడర్లతోనూ, రెవెన్యూ ఆఫీసర్లతోనూ బేరసారాలకు దిగినట్టు తెలుస్తోంది. పాస్​బుక్కుల కోసం భారీ మొత్తాలను ఆఫర్​ చేశారన్న ప్రచారం జరుగుతోంది.

‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఇదీ మరో మాయ..

తూఫ్రాన్​పేటలోనే  ఓ వెంచర్​లో కట్టిన ఇండ్లను అప్పనంగా అమ్మేసుకునేందుకు అక్రమార్కులు స్కెచ్​ వేశారు. 15ఏండ్ల కిందట 375,376,382,383 సర్వే నెంబర్లలోని దాదాపు 15ఎకరాల్లో ఈ వెంచర్ ఏర్పాటైంది. దీన్ని ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్​కు చెందిన  ప్రముఖులు  వారే దాదాపు 60 ఇండ్లను కట్టి అమ్మారు. హైదరాబాద్​ కు చెందిన వారు బ్యాంకుల నుంచి లోన్లు తీసుకుని ఫ్లాట్లను కొనుగోలు చేశారు. వారిలో కొందరు బ్యాంకు ఇన్​స్టాల్​మెంట్లు కట్టకపోవడంతో వాటిని వేలం వేశారు. వేలంలో ఇండ్లు కొనుక్కున్న వారు రిపేర్లు చేయించుకుని ఉంటుండగా, మరికొన్ని ఇండ్లు  శిథిలావస్థకు చేరాయి. ఖాళీగా ఉన్న ఇండ్లమీద తూఫ్రాన్​పేట రియల్​ ఎస్టేట్​ వ్యాపారుల కన్ను పడింది. నకిలీ డాక్యుమెంట్లు రెడీ చేసి వాటిని అమ్మేందుకు సిద్దపడ్డారు.

జీపీఏ హోల్డర్​తోనే మళ్లీ రిజిస్ట్రేషన్లు

2006లో ఏర్పాటైన ఈ వెంచర్​కు సంబంధించి శ్రీనివాసరావు పేర జీపీఏ చేశారు. ఆయనే ప్లాట్లను, ఇండ్లను  రిజిస్ట్రేషన్​ చేయించి ఇచ్చారు. ఖాళీ ఇండ్లమీద కన్నేసిన అక్రమార్కులు తాజాగా శ్రీనివాసరావుతోనే  కలిసి  అమ్మకానికి తెరతీశారు. ఖాళీగా ఉన్న ఐదు ఇండ్లను పక్క సర్వే నంబరుతో నలుగురు వ్యక్తులు శ్రీనివాసరావుతో రిజిస్ట్రేషన్​ చేయించుకున్నారు. నిజానికి ఈ సర్వే నంబరులో ప్లాట్లు గానీ, ఇండ్లు గానీ లేవు. రిజిస్ట్రేషన్​ చేసినందుకు ఒక్కో ఇంటికి రూ.50వేలు చెల్లించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ ఇళ్లకు పెయింట్​ వేసి రీసేల్​ చేసేందుకు సిద్దం చేయడంతో అంతకు ముందు కొనుక్కున్న వారు హైరానా పడుతున్నారు.  తన ఇంటిని ఇతరులు రిపేరు చేయించి రంగులు వేశారంటూ ఖమ్మంకు చెందిన ఓ వ్యక్తి చౌటుప్పల్​ పోలీసులకు, ఎస్వోటీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సరైన సర్వే నంబర్లు లేకపోవడంతో కేసు పెట్టలేదు.

టీఆర్ఎస్​ నేత ప్లాట్​కు ఫేక్​ డాక్యుమెంట్

ఫేక్​ ఐడీలతో  భూముల దందాకు సంబంధించిన అనేక అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసులు అదుపులోకి తీసుకున్న తుఫ్రాన్​పేట ఉపసర్పంచ్​ భర్త ఏనుగు మాధవరెడ్డి ఇంట్లో 50కి పైగా డాక్యుమెంట్లు దొరికినట్టు తెల్సింది. ఆ డాక్యుమెంట్ల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. టీఆర్​ఎస్​నుంచి నల్లగొండ లోకసభ అభ్యర్థిగా పోటీచేసిన  వేమిరెడ్డి నర్సింహారెడ్డికి ప్లాటుకు కూడా ఫేక్​ డాక్యుమెంట్​సృష్టించినట్టు తేలింది. నర్సింహ్మారెడ్డి తన భార్య ఇందిర పేరిట బక్కతట్ల మల్లేశ్​ నుంచి  2008లో 534గజాల ఫ్లాట్​ను రూ.10లక్షలకు కొన్నారు.  మల్లేశ్​అంతకుముందు దీన్ని సికింద్రాబాద్​కు చెందిన యార్లగడ్డ శ్రీలక్ష్మీ నుంచి కొనుగోలు చేశారు. అయితే 2016లో  యార్లగడ్డ శ్రీలక్ష్మీ పేరుతో వేరే మహిళ ఫొటోను పెట్టి అక్రమాకులు ఫేక్​ ఐడీని సృష్టించారు. అప్పుడే నకిలీ డాక్యుమెంట్లతో పరిదం శేఖర్​, ఏనుగు మాధవరెడ్డి ఆప్లాటును తమ పేర  రిజిస్ట్రేషన్​ చేసుకున్నారు.

అసలేం జరిగిందంటే..

తూఫ్రాన్​పేటకు చెందిన ముద్దం నర్సింహకు 33,34,35 సర్వే నంబర్లలో 6.17 ఎకరాల భూమి ఉంది. అతనికి వెంకటయ్య, అంజయ్య ఇద్దరు కొడుకులు. వీరు ముగ్గురు కలిసి 1996లో తమ భూమిని  గ్రీన్​ సిటీ వెంచర్​కు అమ్మేశారు. వెంచర్​ ఓనర్​ సుబ్బరాజు పేర జీపీఏ చేయగా ఆయన  భూమిని ఫ్లాట్లుచేసి అమ్ముకున్నాడు. కొంతకాలానికి నర్సింహులు, 2010లో అంజయ్య చనిపోయారు. ఆ తర్వాత వెంకటయ్య, అతని భార్య అండాలు, అంజయ్య భార్య జంగమ్మ, ఆమె కొడుకులు శేఖర్​, రవి కలిసి సుబ్బరాజుకు చేసిన జీపీఏను క్యాన్సిల్​ చేసి, పాత పుస్తకాల ఆధారంగా ఫౌతీ చేయించుకున్నారు. బీబీనగర్ మండలం రాఘవపురానికి చెందిన  మాజీ నక్సలైట్​ నయీం అనుచరుడు కొర్ని మహేష్​ఈ భూమి కొనుక్కుని తన పేర జీపీఏ చేసుకున్నాడు. హైదరాబాద్​కు చెందిన ఇద్దరికీ మూడెకరాల చొప్పున అమ్మాడు. భూమి కొనుకున్నవారు కాంపౌండ్​వాల్​ కట్టుకుని లాజిస్టిక్​ పార్కును ఏర్పాటు చేశారు. గత ఏడాది మహేష్​ కూడా చనిపోయాడు.

కేసుల భయంతో రిజిస్ట్రేషన్లు క్యాన్సిల్​

భూదందా మీద పోలీసులు సీరియస్​గా కదలడంతో ఐదు ఇండ్లను రిజిస్టేషన్​ చేసుకున్న వారిలో వణుకు మొదలైంది. భూదందాలో  ఏడుగురు అరెస్టు కావడంతో ఈ ఇండ్లను  తమపేర రాయించుకున్న వారు తిరిగి శ్రీనివాసరావును పట్టుకుని రిజిస్ట్రేషన్​ క్యాన్సిల్​ చేయించుకున్నారు. 1984, 1985,1986,1987 నంబర్లతో  ఉన్న డాక్యుమెంట్లు క్యాన్సిల్​ అయ్యాయి.

see also: ఫీజు వసూల్ చేసి.. ఇంటర్ బోర్డుకు కట్టని కాలేజీ