సమ్మక్క జాతర తీరు మారుతోంది!

సమ్మక్క జాతర తీరు మారుతోంది!
  • తల్లుల గద్దెల చుట్టూ ఆఫీసర్లకు పర్మినెంట్‍ బిల్డింగులు
  • ఆదివాసీల ఇండ్లు పోయి.. కమర్షియల్‍ కాంప్లెక్స్​లు
  • చూద్దామన్నా జాతరలో ఎడ్ల బండ్లు కనిపించట్లే 
  • వివాదాస్పదంగా పోలీసుల వ్యవహారశైలి
  • పెరిగిన వీఐపీ దర్శనాలు.. సామాన్య భక్తులకు చుక్కలు
  • క్రమంగా సహజత్వం కోల్పోతున్న మేడారం జాతర

వరంగల్‍ (మేడారం), వెలుగు:‘‘అప్పట్లో మేడారం జాతర గిట్లుండకపోవు.. సమ్మక్క తల్లి జాతర అంటే పనులన్నీ బంద్​పెట్టి అడవి ఒడిలో వారం, పది దినాలు ఉండిపోయేటోళ్లం.. ఎడ్ల బండ్లు కట్టుకుని పిల్లాజెల్లతో వచ్చి, తల్లులు గద్దెల మీదికచ్చే దాక ఇక్కడే గుడారాలు ఏస్కుని తిని పండేటోళ్లం.. అమ్మలు గద్దెల మీదకు వస్తున్నరనగానే.. సంబరంగా పోయి జంపన్న వాగులో స్నానాలు చేసి, కనులారా దర్శించుకునేటోళ్లం.. ఇప్పుడంతా మారిపోతాంది.. అప్పటి తరహా జాతర ఆనవాళ్లు మచ్చుకు కూడా లేవు.. ఇప్పుడంతా పోలీసోళ్ల రాజ్యం నడుస్తాంది.. గాలిమోటర్లు తిప్పుతున్నరుగని,  ట్రాఫిక్​ పేరుచెప్పి మా ఎడ్ల బండ్లను రోడ్లు ఎక్కనిస్తలే.. జాతర్ల కూడా మమ్మల్ని కట్టడి చేస్తన్రు.. వీఐపీల పేరు చెప్పి తిప్పలు పెడ్తున్రు.. గద్దెల దగ్గర  స్వేచ్ఛగా అమ్మల దర్శనం చేసుకోకుండా అపుతున్నరు.. భక్తులుపెరుగుతున్నా జాతర మునుపటి కళను కోల్పోతాంది” 60 ఏండ్ల భక్తుడు సారయ్య చెప్పిన మాటలు మారుతున్న మేడారం జాతర పరిస్థితికి అద్దం పడ్తున్నాయి.

చుట్టూ బిల్డింగులే..

మేడారం సమక్క జాతర అంటేనే వన జాతరగా చెబుతారు. అలాంటి జాతరలో కీలక ప్రదేశమైన తల్లుల గద్దెల చుట్టూ అధికారులు బిల్డింగులు నిర్మించారు. దీంతో గద్దెలు సహజత్వాన్ని కోల్పోయాయి.  అమ్మవార్ల గద్దెల నుంచి  జంపన్నవాగు వైపు టీటీడీ మూడంతస్తుల బిల్డింగ్‍ ఉండగా.. దానికి ఎదురుగా ఐటీడీఏ గెస్ట్​హౌజ్‍ కట్టారు. పెద్దసార్లు డ్యూటీలు చేయడం కోసం వాటిలో ఏసీలు బిగించారు. ఇక గద్దెల మీద తల్లులను దర్శించుకుని బయటకు వెళ్లే క్రమంలో రెండు వైపులా దేవాదాయ, ఆర్‍డబ్ల్యూఎస్‍, ఎక్సైజ్‍ శాఖలకు బిల్డింగులు ఉన్నాయి.

చిలుకలగుట్ట మెయిన్‍ గేటు వైపు నిన్నమొన్నటి వరకు పోలీసులు జాతర ఏర్పాట్ల కోసం టెంపరరీ టెంట్లు వేసుకుని డ్యూటీలు చేసేవారు. ఇప్పుడు అదే స్థలంలో నాలుగు రోజుల జాతర కోసం సిటీలో మంత్రుల నివాసాల మాదిరి కమాండ్‍ కంట్రోల్‍ రూం పేరుతో పెద్ద ఎయిర్‍ కండీషన్‍ బిల్డింగ్‍ కట్టారు. దానిచుట్టూ కరెంట్‍ ఫెన్సింగ్‍ ఏర్పాటు చేశారు. పర్యాటకుల కోసం హరిత హోటళ్లు కట్టామని చెబుతున్నారు తప్పించి.. జాతర టైంలో ఏనాడూ వాటిని సామాన్య భక్తులకు ఇవ్వట్లేదు. పర్మినెంట్‍, టెంపరరీ టెంట్లతో కలిపి 40 నుంచి 45 వరకు ఏసీ సర్వీస్‍ రూంలు ఉన్నా.. అవన్నీ మంత్రులు, లీడర్లు వారి అనుచరులు, ఆఫీసర్లు ఉండేందుకే కట్టుకున్నట్లు ఉంది. 

ఆదివాసీల ఇండ్లు ఏవి?

ఒకప్పుడు మేడారం జాతర అంటే ఎడ్ల బండ్ల ప్రయాణమే. బండెనక బండి.. 20,30 ఎండ్ల బండ్లతో ఊర్లకు ఊర్లే జాతరకు కదిలేవి. కాలక్రమేణా ఎడ్ల బండ్లకు ట్రాక్టర్లు, ఆటోలు, బస్సులు, కార్లు, చివరకు హెలికాప్టర్లు తోడయ్యాయి. అయితే ఇప్పుడు కనీసం చూద్దామనుకున్నా ఎడ్లబండ్లు కనిపించడంలేదు. నిన్నమొన్నటి వరకు సంప్రదాయం ప్రకారం కొందరు వాటిని తీసుకొచ్చినా.. ట్రాఫిక్‍ కంట్రోల్‍ పేరుతో పోలీసులు పెట్టే రూల్స్​తో ఎవరూ ఎడ్ల బండ్లలో వచ్చేందుకు సాహసం చేయడం లేదు.

గతంలో జాతర జరిగే అమ్మవార్ల గద్దెల చుట్టూరా ఆదివాసీల పెంకుటిండ్లు, గుడిసెలు ఉండేవి. జాతరకు వచ్చిన భక్తులకు ఆదివాసీల జీవనశైలి కళ్లకు కట్టినట్లు కనిపించేది. ఇప్పుడు ఆ ప్రాంతాల్లో కమర్షియల్‍ కాంప్లెక్సులు కట్టారు. బయటి వ్యక్తులు సైతం భక్తులకు ఇంటి అద్దెల పేరుతో బిజినెస్‍ చేస్తున్నారు. మొత్తంగా తల్లుల గద్దెల చుట్టూ బిల్డింగులు నిర్మించడంతో నాటి సహజత్వం కనిపించడం లేదు.

పోలీసుల తీరుతో ఆగమాగం

ప్రస్తుతం మేడారం జాతర పోలీసుల రాజ్యం అన్నట్లుగా సాగుతోంది. డ్యూటీల పేరుతో వందల సంఖ్యలో ఐపీఎస్‍, ట్రైనీ ఐపీఎస్‍, ఏఎస్పీ స్థాయి అధికారులు.. వారికింద వేలాది మంది సిబ్బంది జాతర మొత్తాన్ని తమ గుప్పిట్లోకి తీసుకుంటున్నారు. జాతరకు ముందు ఇతర శాఖలు, మీడియాతో కోఆర్డినేషన్‍ మీటింగులు పెట్టి అందరం కలిసి జాతరను సక్సెం చేద్దామని చెప్పినప్పటికీ.. తీరా జాతర మొదలయ్యాక ఖాకీల రాజ్యమే నడుస్తోంది. జాతర చుట్టూ పార్కింగ్‍ పేరుతో గద్దెలకు చుట్టూరా ప్రధాన గేట్లన్నీ తమ చేతుల్లోకి తీసుకొని నానా హడావుడి చేస్తున్నారు. నచ్చినవారితో ఒకలా.. భక్తులతో మరోలా ప్రవర్తిస్తున్నారు. గద్దెల వద్ద డ్యూటీల్లో ఉండేవారు మరింత కఠినంగా వ్యవహరిస్తున్నారు.

కవరేజీ కోసం వచ్చే మీడియా ప్రతినిధులు, ఎమర్జెన్సీ సర్వీస్‍ ఇచ్చే హెల్త్ స్టాఫ్​ను ఇలా ఏ ఒక్కరూ తమ విధులు సక్రమంగా చేయకుండా అడుగడుగునా సొంత రూల్స్ తో ఇబ్బంది పెడుతున్నారు. ఎంట్రన్స్​గేట్లకు తాళాలు వేసి వచ్చిన భక్తులను విసిరిపారేస్తున్నారు. అదే సమయంలో పోలీసుల కుటుంబ సభ్యులు, బంధుమిత్రులను పదుల సంఖ్యలో వీఐపీ దర్శనాలు చేయిస్తున్నారు. దీంతో పోలీసులు వర్సెస్‍ భక్తులు అన్నట్లు ఘర్షణ వాతావరణం ఉంటోంది. ఈ నెల 21న కన్నెపల్లి నుంచి సారలమ్మను తీసుకొచ్చే సమయంలో పోలీసులు వీఐపీలకు పెద్దపీట వేయడంపై పూజారులు సీరియస్‍ అయ్యారు. 

వీఐపీ, వీవీఐపీ భక్తులకే రెస్పెక్ట్

తిరుపతి, వేములవాడ, యాదాద్రి మాదిరి ఇక్కడ వీఐపీ, వీవీఐపీలు ఉండరని.. ప్రతి భక్తుడు తమకు వీఐపీ అంటూ మంత్రులు, ఎమ్మెల్యేలు మీడియా ముందు చెబుతున్నా.. లక్షలాది వీఐపీ, వీవీఐపీ పాసులు జారీ చేస్తున్నారు. ఇందులోనూ 80 శాతం పాసులు లీడర్లు, పోలీసులు, వివిధ శాఖల అధికారులు తమకు నచ్చినవారికే ఇస్తున్నారు. దర్శనం జరిగే చోట వీరికే రెడ్‍ కార్పెట్‍ వేస్తున్నారు. దీంతో చంటి పిల్లలు, వృద్ధులతో దూర ప్రాంతాల నుంచి వచ్చే లక్షలాది భక్తులు గంటల తరబడి అమ్మవార్ల దర్శనం కోసం పడిగాపులు కాయాల్సి వస్తోంది.

గద్దెల చుట్టూ బిల్డింగులు కట్టుడు బాగాలేదు

నేను 30 ఏండ్లుగా సమ్మక్క జాతరకొస్తున్న. గతంలెక్క సహజత్వం లేదిప్పుడు. గద్దెల చుట్టూరా ఆదివాసీల ఇండ్లను చూస్తే కొత్తగా అనిపించేది. కొత్తగా రోడ్లంటే తప్పదు కానీ.. గద్దెల చుట్టూ పెద్ద బిల్డింగులు కడితే అడవి జాతర అనిపించట్లేదు. ఆఫీసర్లు నాలుగు రోజుల డ్యూటీ కోసం గద్దెలకు ఇంత దగ్గరగా ఏసీ బిల్డింగులు కట్టడం సరికాదు. 
- బైండ్ల కల్పన, హైదరాబాద్‍

పోలీసులు మరీ జబర్దస్తీ చేస్తున్రు

జాతరలో అడుగడుగునా పోలీసులు మరీ జబర్తస్తీ చేస్తున్నారు. భక్తులు ఏదైనా అడిగితే సాయం చేసేటట్లు ఉండాలి. కానీ ఇక్కడ దొంగల మాదిరి విసిరికొడుతున్రు. దురుసుగా ప్రవర్తిస్తున్నారు. నడవలేని ముసలోళ్లు ఉన్నా పట్టించుకోవడం లేదు. తెలిసినోళ్లు వస్తే మాత్రం పది, ఇరవై మందిని దగ్గరుండి లోపలికి తీసుకెళ్తున్రు. జాతర మొత్తం పోలీసుల రాజ్యమే.