- ప్రస్తుతం ఉన్న రెండు కోర్సులకు అదనంగా మరో నాలుగు కొత్త కోర్సుల్లో అడ్మిషన్స్
- ఈ ఏడాది నుంచే ప్రారంభం
ములుగు, వెలుగు: ములుగులోని సమ్మక్క సారక్క కేంద్రియ గిరిజన విశ్వవిద్యాలయంలో కొత్త కోర్సులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే రెండు కోర్సులు కొనసాగుతుండగా, ఈ ఏడాది నుంచి ఐఐటీ హైదరాబాద్(ఐఐటీహెచ్), హైదరాబాద్ లోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్(టీఐఎస్ఎస్) వంటి ప్రముఖ విద్యా సంస్థల సహకారంతో మరో నాలుగు కోర్సులు ప్రారంభిస్తున్నట్లు యూనివర్సిటీ వీసీ వైఎల్ శ్రీనివాస్ తెలిపారు.
బీటెక్ కంప్యూటర్ సైన్స్ & ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బీఎస్సీ(హానర్స్) కంప్యూటర్ సైన్స్ అండ్ డేటా అనలిటిక్స్ కోర్సులకు ఇంటర్ ఎంపీసీలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలన్నారు. బీఎస్సీ(హానర్స్) మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ కోర్సుకు ఇంటర్ ఎంఈసీ లేదంటే ఎంపీసీలో 60 శాతం మార్కులతో పాస్ అయ్యి ఉండాలని చెప్పారు.
ఎంఏ- పబ్లిక్ పాలసీ, గవర్నెన్స్(డెవలప్మెంటల్ స్టడీస్) కోర్సుకు ఏదైనా డిగ్రీలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇప్పటికే కొనసాగుతున్న బీఎస్సీ(హానర్స్), ఇంగ్లీష్, బీఎస్సీ(హానర్స్) ఎకనామిక్స్ కోర్సులకు ఇంటర్ లో ఏదైనా గ్రూప్ లో కనీసం 60 శాతం మార్కులు సాధించి ఉండాలని వీసీ తెలిపారు. అడ్మిషన్, ఇతర వివరాల కోసం 7382437384, 9347809918 నంబర్లలో, సంప్రదించాలని సూచించారు.
