అట్టహాసంగా తొలిఘట్టం..సారలమ్మ ఆగమనం.. పులకించిన భక్తజనం

 అట్టహాసంగా తొలిఘట్టం..సారలమ్మ ఆగమనం.. పులకించిన భక్తజనం
  • గద్దెపై కొలువుదీరిన వనదేవత
  • తరలివస్తున్న భక్తజనం

కోల్​బెల్ట్/​లక్షెట్టిపేట/నస్పూర్, వెలుగు:  మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా మినీ మేడారాల్లో సమ్మక్క–సారలమ్మ జాతర బుధవారం సంబరంగా ప్రారంభమైంది. రెండేళ్లకోసారి వచ్చే జాతరకు భక్తులు భారీ ఎత్తున తరలివస్తున్నారు. సారలమ్మను గద్దెకు తీసుకువచ్చే క్రతువు కన్నులపండువగా సాగింది. మహిళలు సారలమ్మ తల్లికి ఎదురొచ్చి హారతులిచ్చి స్వాగతం పలికారు. మంచిర్యాల గోదావరి నది తీరాన సాయంత్రం ఇల్లారిలో గిరిజన పూజారులు ప్రత్యేక పూజలతో వనంలోని సారలమ్మను డప్పుచప్పుళ్ల మధ్య నృత్యాలు చేస్తూ జనంలోకి తీసుకొచ్చారు. 

దేవాదాయ, ధర్మదాయశాఖ ఏఈ రవికుమార్, జాతర నిర్వహణ కమిటీ సభ్యులు పూజలు చేశారు. భక్తులు ఉదయం నుంచే  గోదావరిలో పుణ్యస్నానాలు చేసి ఇష్టదైవాలకు కానుకలు సమర్పించుకున్నారు. ఎత్తు బంగారంతో గద్దెల ప్రాంగణానికి చేరుకొని మొక్కులు చెల్లించుకన్నారు. ఉదయమే గిరిజన పూజారులు సమ్మక్క–సారలమ్మలకు సారె తీసుకొచ్చి గద్దెల వద్ద సమర్పించారు. జాతరలు జరిగే ప్రాంగణాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా దేవాదాయ, ధర్మదాయ శాఖ, మున్సిపల్, సింగరేణి యాజమాన్యాలు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 

సింగరేణి ప్రాంతాల్లో వనదేవతల జాతర 

 సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలో రామకృష్ణాపూర్​లోని ఆర్కే1ఏ గని సమీప పాలవాగు ఒడ్డున, శ్రీరాంపూర్​ సీసీసీ ముక్కిడి పోచమ్మ ఆలయం వద్ద సారలమ్మ తల్లి గద్దెకు చేరుకోవడంతో జాతర తొలిఘట్టం ప్రారంభమైంది. మందమర్రి అంగడి బజార్​లోని దూలం కనుకయ్య గౌడ్​ ఇంట్లో మేడారం నుంచి వచ్చిన కోయ పూజారులు సంప్రదాయబద్ధంగా పూజలు చేసి బోనాలతో తరలివచ్చారు. 

డప్పుచప్పుళ్లు, శివసత్తుల పూనకాలు, భక్తులు, యువతుల నృత్యాల నడుమ సారలమ్మను ఆర్కే1ఏ గని సమీపంలోని జాతర ప్రాంగణంలోని గద్దెకు తీసుకవచ్చారు. సింగరేణి జీఎం దంపతులు ఎన్.రాధాకృష్ణ–-శ్రీవాణి, శ్రీరాంపూర్​ ఏరియా ఇన్​చార్జ్ జీఎం సత్యనారాయణ–అరుణ దంపతులు, బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, ఎస్వోటుజీఎం జీఎల్ ప్రసాద్, ఆఫీసర్లు, కార్మిక, రాజకీయ నాయకులు ప్రత్యేక పూజలు చేశారు. లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఇటిక్యాలలో జాతర వైభవంగా ప్రారంభమైంది. అన్ని ప్రాంతాల్లో పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేశారు.